
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి అయిన రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ.. ఐఎస్ పుణె మాడ్యూల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ, ముంబైలలోని ప్రముఖ ప్రదేశాలపై పలుమార్లు రెక్కీ నిర్వహించాడు.
ఇటీవల అతడిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ రిజ్వాన్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. దాంతో అతడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. రిజ్వాన్ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తుగ్లకాబాద్ లోని బయోడైవర్సిటీ పార్క్ వద్ద స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.
రిజ్వాన్ నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశ స్వాతంత్య్ర వేడుకల వేళ రిజ్వాన్ ఢిల్లీకి రావడం అధికారులలో కలకలం రేపింది.