సూసైడ్ చేసుకుందామని ఐస్‌క్రీంలో విషం కలిపిన మహిళ.. అది తిని కొడుకు, చెల్లి మృతి

సూసైడ్ చేసుకుందామని ఐస్‌క్రీంలో విషం కలిపిన మహిళ.. అది తిని కొడుకు, చెల్లి మృతి

తాను చనిపోదామనుకొని ఓ మహిళ ఐస్‌క్రీంలో విషం కలుపుకుంటే.. అది తిని ఆమె కొడుకు, చెల్లి మృతిచెందిన విషాదకర ఘటన కేరళలో జరిగింది. కాసరగోడ్ జిల్లాలోని కన్హంగాడ్‌కు చెందిన 25 ఏళ్ల వర్ష ఏవో సమస్యలతో ఫిబ్రవరి 11న సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో ఐస్‌క్రీంలో ఎలుకల మందు కలుపుకొని తిన్నది. ఆ తర్వాత కొంత అసౌకర్యంగా ఉండటంతో గదిలోకి వెళ్లిపోయింది. అయితే కాసేపటికే అక్కడికి వచ్చిన వర్ష చెల్లెలు దృశ్య (19) మరియు వర్ష కొడుకు అధ్వైత్ (5) అదే ఐస్‌క్రీంను తిన్నారు. ఆ తర్వాత వారు రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెప్పించుకొని తిన్నారు. అదేరోజు రాత్రి అధ్వైత్ వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 12న అధ్వైత్ చనిపోయాడు.

అధ్వైత్ చనిపోయిన వారం తర్వాత దృశ్య కూడా అనారోగానికి గురైంది. దాంతో ఆమెను కూడా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజులపాటు చికిత్స పొందిన దృశ్య.. ఆరోగ్యం విషమించడంతో ఫిబ్రవరి 24న మరణించింది. బిర్యానీ వల్లే వీరిద్దరూ చనిపోయారని కుటుంబసభ్యులు తొలుత భావించారు. కాగా.. కుటుంబంలో వరుస మరణాలతో వారి బంధువు సనోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. వర్ష విషం కలిపిన ఐస్‌క్రీం తినడం వల్లే వీరిద్దరూ మరణించారని పోలీసులు తేల్చారు. కాగా.. వర్ష సూసైడ్ చేసుకోవాలనుకోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు. వర్ష ఐస్‌క్రీం తిన్న తర్వాత ఎటువంటి అనారోగ్యానికి గురికాకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదని పోలీసులు తెలిపారు. వర్షను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 మరియు 305 కింద కేసు నమోదు చేశారు.