వైద్యానికి డబ్బుల్లేక పిల్లలను చూస్తూ.. కన్నుమూసిన తల్లి

వైద్యానికి డబ్బుల్లేక పిల్లలను చూస్తూ.. కన్నుమూసిన తల్లి

ఉసురు తీసిన పేదరికం..

సీరియస్​గా ఉందని హైదరాబాద్ రెఫర్​ చేసిన డాక్టర్లు

పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు రెఫర్ చేస్తే.. ట్రీట్మెంట్​కు డబ్బుల్లేక ఇంటికి తీసుకువచ్చిన పిల్లలు

బిడ్డలను చూస్తూనే ప్రాణాలొదిలిన మహిళ

కరోనా అనుకుని దగ్గరికి వెళ్లని గ్రామస్తులు

గుండాల మండలం నర్సాపురం తండాలో విషాదం

గుండాల వెలుగు : అచ్చలి ఓ లంబాడీ మహిళ. ఆ భాషలో అర్థం గుణవంతురాలు అని. పేదింట పుట్టిన అచ్చలి అదే పేదరికంతో పెరిగింది. మరో పేదింట అడుగుపెట్టగా ఈ మధ్యే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లడంతో వారిని కూలి పనులు చేస్తూ పెంచింది. ఈ క్రమంలో వ్యాధి బారిన పడగా దవాఖానాకు వెళితే ఖర్చయ్యే డబ్బులతో తన పిల్లలకు తిండి పెట్టొచ్చని భావించి నిర్లక్ష్యం చేసింది. చివరికి ఆ వ్యాధి ముదిరి..డబ్బుల్లేక.. ట్రీట్​మెంట్​చేయించుకోలేక కన్నుమూసింది. కరోనా తో చనిపోయిందనుకుని ఎవరూ దగ్గరకు రాకపోవడంతో  పిల్లలు, దగ్గరి వారే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.  ఈ ఘటన గుండాల మండలం నర్సాపురం తండాలో చోటుచేసుకుంది.

అమ్మా.. నేను పనికి వస్తా…

అచ్చలి (38) తల్లిదండ్రులకు ఒక్కతే బిడ్డ. ఈమెను వరంగల్ ​జిల్లాకు చెందిన నందకు ఇచ్చి 30 ఏండ్ల కిందట పెండ్లి చేయగా ఇద్దరూ ఇక్కడే ఉండి కూలీ పని చేసుకుని బతికేవాళ్లు. వీరికి ఒక ఆడపిల్ల..ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. రెండేండ్ల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోగా ఎలాగో కష్టపడి పెద్ద బిడ్డ పెండ్లి చేసింది. అల్లుడు గుండాలలో ఆటో డ్రైవర్​ కాగా  వారిదీ పేద కుటుంబమే. కూలికి వెళ్లే అమ్మ కష్టాన్ని చూడలేని పెద్ద కొడుకు చదువు మానేసి తల్లితోనే పనికి వెళ్లేవాడు.

రోగం ముదిరినా పట్టించుకోలే

అచ్చలి చాలా రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతోంది. దవాఖానాకు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ట్రీట్​మెంట్​ తీసుకోలేదు. చలికాలం వ్యాధి ముదరడంతో నెల నుంచి శ్వాస ఆడక సతమతమవుతోంది. దీంతో కొడుకు 15 ఏండ్ల పెద్దకొడుకు యాకూబ్​ ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్​ దవాఖానాలో చేర్పించాడు. పరిస్థితి బాగా లేదని చెప్పిన డాక్టర్లు హైదరాబాద్​ తీసుకువెళ్లాలని చెప్పారు. చేతిలో రూపాయి లేని స్థితిలో ఆ పని చేయొద్దని పిల్లలను వారించింది అచ్చలి. తనను ఇంటికే తీసుకువెళ్లాలని వారిని కోరింది.

గుర్తుంచుకోండి బిడ్డా…నా పేరు అచ్చలి

తల్లి కోరిక మేరకు కొడుకు యాకూబ్ ​ఆమెను ఖమ్మం దవాఖానా నుంచి నర్సాపురం తండాలోని ఇంటికి తీసుకువచ్చాడు. వచ్చేప్పుడు ఆమె పిల్లలనే చూస్తూ వచ్చింది. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వారి వంకే చూస్తూ  మాట్లాడడానికి ప్రయత్నించింది. నోటికి నెబ్యులైజర్​ ​ఉండడంతో దగ్గరికి రావాలని సైగ చేసింది. ఇద్దరినీ హత్తుకుని కన్నీరు పెట్టుకుంది. ‘ బిడ్డలారా నా పేరు అచ్చలి. మా అవ్వ అయ్య ఆ పేరు ఎందుకు పెట్టిన్రో తెలుసా…నేను గుణవంతురాలిగా ఉండాలి అని.. దాని అర్థం మీకు కూడా తెలుసు. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరినీ ఎప్పుడూ చేయి చాచి అడగలే. తినడానికి తిండి లేకపోతే నీళ్లు తాగి పడుకున్నా. యాకూబూ..ఇక నీదే భారం బిడ్డా. తమ్ముడిని చూసుకో…అక్క పరిస్థితి కూడా అంతంత మాత్రమే. వాళ్లకేం కాకుండా చూసుకో…ఇగ నేను బతుకా…జాగ్రత్త కొడుకా..అంటూ వారి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది.

కరోనా అంటూ దగ్గరకు రాని గ్రామస్తులు

అయితే శ్వాస కోస వ్యాధితో బాధపడుతూ అచ్చలి చనిపోగా కరోనాతో చనిపోయి ఉండవచ్చని భావించిన  గ్రామస్తులెవరూ ఆమె దగ్గరకు రాలేదు. దీంతో సర్పంచ్​ అజ్మీరా మోహన్​ సహాయంతో పిల్లలిద్దరూ కొంతమంది బంధవుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.  అసలు ఆమె ఏ వ్యాధితో చనిపోయిందో చెప్పాలంటూ చికిత్స తీసుకున్న ఖమ్మం ప్రైవేట్​ హాస్పిటల్​కు ఫోన్​చేస్తే ‘మేం కరోనా టెస్టులు చేయలేదు. కాబట్టి ఏమి చెప్పలేం’ అని సమాధానమిచ్చారు.