తండ్రికి బిడ్డను దూరం చేసే హక్కు తల్లికి లేదు: ధావన్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

తండ్రికి బిడ్డను దూరం చేసే హక్కు తల్లికి లేదు: ధావన్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో ఊరట లభించింది. దీంతో అతడు దాదాపు మూడేళ్ల తరువాత తన కొడుకును కలవబోతున్నాడు. జొరావర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అయేషా ముఖర్జి ససేమిరా అనడంతో.. ధావన్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా అయేషా ప్రవర్తనను తప్పుపట్టిన న్యాయస్థానం.. కొడుకుపై తల్లికి మాత్రమే హక్కులు ఉండవని, తండ్రికి కూడా సమాన హక్కులు ఉంటాయని గుర్తుచేసింది. జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాల్సిందేనని ఆదేశించింది. 

కొడుకును తీసుకుని ఆస్ట్రేలియాకు..

ధావన్‌, అయేషా ముఖర్జి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటూనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జొరావర్‌ మైనర్ కనుక పిల్లాడి భాధ్యతను కోర్టు.. తల్లికి అప్పగించింది. దీంతో ఆమె కొడుకును తీసుకుని 2020లో ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. అయితే కొన్ని నెలల క్రితం ధావన్‌.. తన ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌ ఉన్నందున జొరావర్‌ను తీసుకురావాలని అయేషాను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 

ఆ సమయంలో అయేషా తరుపు న్యాయవాది.. 'జొరావర్‌కు స్కూళ్లో ముఖ్యమైన క్లాసులు జరుగుతున్నందున తీసుకురాలేకపోతున్నట్లు తెలిపిందని..; కోర్టుకు తెలియజేశాడు. దీంతో కోర్టు ధావన్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. అతడు మరో దారి లేక ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌ను వేసవి సెలవుల వరకు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు కూడా జొరావర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అయేషా ససేమిరా అనడంతో.. ధావన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు అతని మాజీ భార్య తీరును తప్పుపట్టింది. కొడుపై కేవలం తల్లికి మాత్రమే హక్కులు ఉండవని, తండ్రికి కూడా సమాన హక్కులు ఉంటాయని తెలిపింది.

"బాలుడు మైనర్‌ కనుక బాధ్యతలను కోర్టు తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని చూపించకుండా ఉండే హక్కు తల్లికి లేదని వ్యాఖ్యానించింది. తండ్రి ప్రవర్తన చెడుగా ఉంటే తప్ప.. బిడ్డను తండ్రికి దూరం చేసే హక్కు ఏ తల్లికి లేదని స్పష్టం చేసింది. ధావన్‌ కుటుంబంలో జరిగే ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌కు బాబును తీసుకురావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది".

ధావన్‌, అయేషా ముఖర్జికి 2012లో వివాహం అవ్వగా, వీరికి జొరావర్‌ అనే 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమె మొదటి భర్తతో ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చిది. వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్‌, వారి బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ, వీరి దాంపత్య జీవితం కొన్నాళ్లకే ముగింపుకు దారితీసింది.