రైలు కింద పడి తల్లీకూతురు ఆత్మహత్య .. ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలంలో ఘటన

రైలు కింద పడి తల్లీకూతురు ఆత్మహత్య .. ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలంలో ఘటన
  • కాపాడేందుకు ప్రయత్నించిన  భర్తకు గాయాలు

కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : కుటుంబ కలహాలతో ఏడాది వయసున్న బిడ్డతో కలిసి ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిని కాపాడేందుకు యత్నించిన భర్త గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలం చింతగూడ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. బెల్లంపల్లి రైల్వే ఎస్సై సుధాకర్‌‌, హెడ్‌‌కానిస్టేబుల్‌‌ సంపత్‌‌ తెలిపిన వివరాల ప్రకారం..

చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రానికి చెందిన జగత్‌‌రాం తన భార్య స్వప్న సూర్య వంశీ (27), కూతురు జాస్మి (11 నెలలు)తో 20 రోజుల కింద చింతగూడకు వచ్చి ఇటుకబట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరుగగా... స్వప్న జాస్మిని తీసుకొని బయటకు వచ్చింది. రాత్రి 10 గంటల టైంలో చింతగూడ సమీపంలోని చందమామ బ్రిడ్జి సమీపంలోకి వచ్చిన స్వప్న కూతురితో కలిసి గుర్తు తెలియని రైలు కింద పడింది. 

వారి వెనుకే వచ్చిన జగత్‌‌రాం భార్య, కూతురిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొట్టడంతో అక్కడే పడిపోయాడు. సోమవారం ఉదయం స్థానికులు, రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా.. స్వప్న, జాస్మి చనిపోగా.. గాయాలతో ఉన్న జగత్‌‌రాంను మంచిర్యాల హాస్పిటల్‌‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.