అమ్మ హత్యకు రూ. 50 వేలు సుపారీ.. ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్‌‌

అమ్మ హత్యకు రూ. 50 వేలు సుపారీ.. ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్‌‌
  • హత్యను ముందే ఊహించినా.. బిడ్డ మీద నమ్మకంతో ఇంట్లోనే పడుకున్న తల్లి

పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ (కె) గ్రామంలో ఆస్తి కోసం రెండు రోజుల కింద తల్లిని హత్య చేసిన కేసులో కూతురు, అల్లుడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. తల్లిని హత్య చేసేందుకు బిడ్డ రూ. 50 వేలు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. 

కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏసీపీ నర్సయ్య వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన బాదావత్‌‌ లక్ష్మి భర్త 20 ఏండ్ల కింద చనిపోగా కూతురు సంగీతతో కలిసి ఉండేది. సంగీత అదే మండలంలోని దుబ్బతండ (ఎస్‌‌పీ)కు చెందిన భూక్యా వీరన్నను ప్రేమ వివాహం చేసుకొని సికింద్రాబాద్‌‌లో ఉంటోంది. 

లక్ష్మి గత ఫిబ్రవరిలో తనకున్న 25 గుంటల భూమిని అమ్మగా రూ. 15 లక్షలు వచ్చాయి. దీంతో కూతురు సంగీతకు ఎనిమిది తులాల బంగారం పెట్టడంతో పాటు, రూ. మూడు లక్షలు ఇచ్చింది. మరో రూ. 5 లక్షలను తన వద్దే ఉంచుకుంది. అలాగే లక్ష్మి పేరున గ్రామంలో మరికొంత వ్యవసాయ భూమితో పాటు జనగామ సమీపంలోని బాణాపురంలో ఓ ప్లాటు ఉంది. 

దీంతో ఆ భూములను తమ పేరున రాయడంతో పాటు మిగిలిన రూ. 5 లక్షలు కూడా ఇవ్వాలని సంగీత, వీరన్న కొంత కాలంగా లక్ష్మీతో గొడవ పడుతున్నా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్‌‌లో ట్యాక్సీ నడుపుతున్న, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నర్సింగ్‌‌తండాకు చెందిన భూక్య సామ్రాజ్‌‌ను సంగీత, వీరన్న కలిసి లక్ష్మిని హత్య చేసేందుకు సహకరిస్తే రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.

 ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన అర్ధరాత్రి సామ్రాజ్‌‌ కారులో సంగీత, వీరన్న.. తండాలోని లక్ష్మి ఇంటికి వచ్చారు. ఆమె నిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురూ తిరిగి హైదరాబాద్‌‌ వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌‌కుమార్‌‌, యాకూబ్, కానిస్టేబుళ్లు రాజ్‌‌కుమార్‌‌, శ్రీనివాస్‌‌ పాల్గొన్నారు.

చంపుతారన్న అనుమానంతో పక్కింటి వారికి ఫోన్‌‌

కూతురు, అల్లుడు మరో వ్యక్తితో కలిసి అర్ధరాత్రి ఇంటికి రావడంతో.. ఈ టైంలో ఎందుకు వచ్చారని లక్ష్మి ప్రశ్నించగా.. పని మీద పక్క ఊరికి వచ్చామని, అక్కడ ఆలస్యం అయిందని సమాధానం చెప్పారు. అయితే గతంలో గొడవలు జరగడంతో అనుమానం వచ్చిన లక్ష్మి వెంటనే ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తికి ఫోన్‌‌ చేసి విషయం చెప్పింది. దీంతో భయంగా ఉంటే తమ ఇంటికి రావాలని అతడు సమాధానం ఇచ్చాడు. అయినా తన బిడ్డ, అల్లుడు తనను చంపుతారా ? అనే నమ్మకంతో లక్ష్మి ఇంట్లోనే పడుకుంది. ఆమె గాఢనిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి హత్య చేశారు.