కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య

కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య
  •     బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టిన మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     రిపేర్ కోసం రూ.20 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     డబ్బు లేక ఆత్మహత్య చేసుకున్న తల్లి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కేసులో కొడుకు జైలుకు వెళ్తాడన్న భయంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్‌‌‌‌‌‌‌‌లోని దీన్‌‌‌‌‌‌‌‌దయాళ్‌‌‌‌‌‌‌‌బస్తీలో బుధవారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన వెంకటరమణ భార్య సూర్యకుమారి (35), కుమారుడితో కలిసి దీన్‌‌‌‌‌‌‌‌దయాళ్‌‌‌‌‌‌‌‌నగర్ బస్తీలో ఉంటున్నారు. వెంకటరమణ కూలీ పనులు చేస్తుండగా, సూర్యకుమారి ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. బుధవారం సూర్యకుమారి డ్యూటీకి వెళ్లిన తర్వాత ఆమె కుమారుడు బైక్‌‌‌‌‌‌‌‌ తీసుకుని బయటకు వెళ్లాడు.

హకీంబాబా దర్గా సమీపంలో ఓ బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టడంతో కారు స్వల్పంగా డ్యామేజ్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌‌‌‌‌తో కలిసి బాలుడిని, బైక్‌‌‌‌‌‌‌‌ను తీసుకొని కారు ఓనర్‌‌‌‌‌‌‌‌ ఇంటి వద్దకు వెళ్లాడు. కారు రిపేర్‌‌‌‌‌‌‌‌ కోసం సాయంత్రం 4 గంటల్లోగా రూ. 20 వేలు ఇవ్వాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ బాలుడి తండ్రి వెంకటరమణకు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి బెదిరించాడు.

దీంతో డబ్బులు లేకపోవడంతో బాలుడి కుటుంబం ఆందోళనకు గురైంది. డబ్బులు ఇవ్వకపోతే కొడుకు జైలుకు వెళ్తాడన్న భయంతో సూర్యకుమారి ఆందోళనకు గురై అదే రోజు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె భర్త వెంకటరమణ ఫిలింనగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారు డ్రైవర్ చంద్రశేఖర్, మహేశ్వర్‌‌‌‌‌‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.