
సిద్దిపేట/కొండపాక, వెలుగు: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ తల్లి తన ఏడాదిన్నర కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామానికి చెందిన గవ్వల స్వామితో చేర్యాల మండలం వేచరేని గ్రామానికి చెందిన బియ్య పోచయ్య, మల్లవ్వల కూతురు నవిత(22) వివాహం 2013లో జరిగింది. జీవనోపాధి కోసం కొద్దిరోజులు వీరు రామాయంపేటలో నివాసం ఉన్నారు. ఏడాది క్రితం స్వగ్రామమైన సిరసనగండ్లకు వచ్చారు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి.
ఈ విషయాన్ని నవిత తన సోదరుడు, తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్వామితో ఫోన్ లో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్వామి నా యిష్టమంటూ దురుసుగా మాట్లాడాడు. గొడవలతో తీవ్రంగా కలత చెందిన నవిత శనివారం మధ్యాహ్నం స్వామి పొలం పనులకు వెళ్లగానే ఇంట్లో ఉన్న కిరోసిన్ కొడుకు మణిదీప్తోపాటు తనపై పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన చుట్టుపక్కలవారు వెళ్లి చూసేసరికే ఇద్దరూ మృతిచెందారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.