ఆడబిడ్డలు పుట్టిన్రని అరిగోస పెట్టిన్రు

ఆడబిడ్డలు పుట్టిన్రని అరిగోస పెట్టిన్రు

మూడేళ్ల కిందట మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది.. ఐదు నెలల కిందట రెండోసారి కూడా అమ్మాయే. దీంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇంటికి పోయి మళ్లీ కట్నం తీసుకురమ్మన్నారు. అత్త మామలతో రోజూ సతాయింపులే. అడ్డు చెప్పాల్సిన భర్త వారికి వంతపాడాడు. రోజులు గడిచే కొద్దీ వేధింపులు పెరిగాయే కానీ తగ్గలేదు. బాధలు తాళలేక పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటికి వచ్చింది. ‘నన్నే ఇంతలా వేధిస్తున్నరు. ఇగ పిల్లలను ఏం చేస్తరో. నేను చస్తే నా కూతుళ్ల గతేందో’ అని అనుకుందో ఏమో ఆ తల్లి. చిన్నారులను గుండెలకు అదుముకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగింది.

కూతుళ్లను కన్నవు.. 4 లక్షలు తీసుకురా..

మల్యాల మండలం సర్వాపూర్​గ్రామానికి చెందిన బక్కయ్య, ఎల్లవ్వ దంపతుల కొడుకు నరేశ్​కు గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన ఓదెలు‌‌, లక్ష్మి కూతురు స్వప్నతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు అహల్యశ్రీ (3), బిన్ను (5 నెలలు). ఇద్దరూ కూతుళ్లే పుట్టారని స్వప్నకు అత్తింటి వేధింపులు పెరిగాయి. కూతుళ్లను కన్నందుకు మరో రూ.4 లక్షలు కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు దిగారు.

భర్తతోపాటు అత్తమామలు, మరిది వేధిస్తున్నారంటూ గతంలో గంగాధర పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో పెద్ద మనుషులు రాజీ కుదిర్చారు. కానీ సతాయింపులు ఆగకపోవడంతో మంగళవారం ఇంటి నుంచి పిల్లలతో కలిసి స్వప్న బయటికి వెళ్లింది. మల్యాల శివారులోని వ్యవసాయ బావిలో పిల్లలతోపాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మృతదేహాలు బావిలో తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇద్దరు కూతుళ్లతోపాటు స్వప్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఊరు ఊరంతా అక్కడికి చేరుకున్నారు. స్వప్న తల్లి లక్ష్మి రోదన.. అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే స్వప్న ఆత్మహత్య చేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల సీఐ నాగేంద్ర తెలిపారు.