మదర్ డెయిరీ, ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం : గుడిపాటి మధుసూదన్ రెడ్డి

మదర్ డెయిరీ, ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం : గుడిపాటి మధుసూదన్ రెడ్డి
  • మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు: నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ పరస్పర అంగీకార ఒప్పందం చేసుకుందని, ఇకపై రెండు సంస్థలు కలిసి పని చేస్తాయని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.  మంగళవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని మున్నూరుకాపు సత్ర భవనంలో మదర్ డెయిరీ డైరెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. అప్పులపాలైన మదర్ డెయిరీని తిరిగి గాడిలో పెట్టడానికి ఎన్డీడీబీతో 15 ఏళ్లు కలిసి పని చేసేలా ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు. ఒప్పందంలో భాగంగా పాలసేకరణ బాధ్యత మదర్ డెయిరీ తీసుకోగా.. ప్రొడక్షన్, మార్కెటింగ్ బాధ్యత ఎన్డీడీబీ తీసుకుందని పేర్కొన్నారు. 

పాడి రైతుల పెండింగ్‌‌ బిల్లులు వారంలో చెల్లిస్తాం

మదర్ డెయిరీ సంస్థకు గ్రాంట్ కింద ఎన్డీడీబీ ప్రతి ఏడాది రూ.5 కోట్ల చొప్పున.. 15 ఏళ్లకు గానూ రూ.75 కోట్లు ఇవ్వడానికి అంగీకార ఒప్పందం జరిగిందన్నారు. ఎన్డీడీబీ సహకారంతో పాడి రైతులకు చెల్లించాల్సిన ఏడు బిల్లులను వారంలోపే చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. మదర్ డెయిరీ సంస్థ నష్టాల్లో ఉన్న విషయాన్ని గమనించిన పాడి రైతులు.. బిల్లులు చెల్లించకున్నా సంస్థకు పాలు పోస్తూ మదర్ డెయిరీకి అండగా నిలిచారని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మదర్ డెయిరీ డైరెక్టర్లు సందిళ్ల భాస్కర్ గౌడ్, కల్లెపల్లి శ్రీశైలం, రాంరెడ్డి, నర్సింహ, శ్రీధర్ రెడ్డి, జంగయ్య, లక్ష్మీనరసింహారెడ్డి, పాండు, రంగారెడ్డి, నరేందర్ రెడ్డి, ఎన్డీడీబీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.