20 నెలల పసిపాపకు సిగరెట్, మద్యం తాగించిన తల్లి

20 నెలల పసిపాపకు సిగరెట్, మద్యం తాగించిన తల్లి

ఓ తల్లి 20 నెలల పాపకు బలవంతంగా సిగరెట్, మద్యం తాగించిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. సిల్చార్‌కు చెందిన ఓ మహిళ 20నెలల పసిబిడ్డకు సిగరెట్, మద్యం తాపిస్తూ వేధిస్తోందని స్థానికులు.. చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు హుటాహుటీన మహిళ నివాసానికి చేరుకుని బిడ్డను రక్షించారు. తదుపరి విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు.  

నివేదికల ప్రకారం, ఈ దుశ్యర్య గడిచిన బుధవారం(జూన్ 12) రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. పసిపాపకు పొగ, మద్యం తాగించి తల్లి వేధిస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిడ్డను రక్షించినట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం తల్లి, బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కస్టడీలో ఉన్నారని, సమగ్ర విచారణ జరిపాక తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

దత్తత తీసుకోండి.. 

అమ్మ తనాన్నే మరిచిన ఈ తల్లిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు బిడ్డను ఎవరైనా దత్తత తీసుకోవాలని కోరుతున్నారు. "ప్రేమానురాగాలు పంచె బాధ్యతాయుతమైన కుటుంబానికి బిడ్డను దత్తత ఇవ్వాలి! ఆమె తల్లిగా ఉండటానికి తగినది కాదు. ఈ ఘటన విదేశాల్లో జరిగుంటే ఆమె చాలా కాలం పాటు జైలులో ఉండేది" అని ఓ నెటిజెన్ ఎక్స్(ట్విట్టర్)లో కామెంట్ చేశారు.