
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌స్టోరీ’. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా నటించిన ఈ సిరీస్‌కు శివ కృష్ణ బుర్రా దర్శకుడు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మించారు. మురళీధర్, సదానందం, సుజాత ఇతర పాత్రలు పోషించారు. ఆగస్టు 8 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనిల్ గీలా మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కర్ని ఎంటర్‌టైన్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. కుటుంబ సమేతంగా మూడు గంటల పాటు ఏడు ఎపిసోడ్స్ చూసేలా ఉంటుంది’ అని అన్నాడు. దర్శకుడు శివ కృష్ణ బుర్రా మాట్లాడుతూ ‘అందర్నీ నవ్వించేలా, మెప్పించేలా ఈ సిరీస్ ఉంటుంది. మాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి, జీ5 టీంకు థాంక్స్’ అని చెప్పాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సిరీస్ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాతలు మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ అన్నారు.