బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి

బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి

సీనియర్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుభవాన్ని బీజేపీ పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అవమానాలు బరించలేకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ నాయకుడు బీజేపీలో సంతృప్తిగా లేరు. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను పార్టీ సమావేశాల్లో వేదిక కింద కూర్చోపెడ్తున్నారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించింది. భూకబ్జాలు చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు? ఈటల పెద్ద అవినీతిపరుడు. ఈటలకు అంత ఆస్తి ఎలా వచ్చింది? ఈటలను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలి. ఈటల రాజేందర్ గెలవడానికి వీల్లేదు. అసలు ఈటలకు పోటీచేయడానికి కూడా అర్హత లేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు అద్బుత పథకం. ఈ పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ను గౌరవించాలి. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్. దళితులకు పది లక్షలు ఇస్తోన్న ఏకైక మగాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్‌కు అండగా నిలవాలి’ అని మోత్కుపల్లి అన్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఎవరూ వెళ్లకూడదని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కానీ మోత్కుపల్లి మాత్రం ఆ సమావేశానికి హాజరై.. సీఎంను ప్రశసించారు. ఇదంతా చూస్తుంటే ఆయన టీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.