
ఎత్తు తక్కువైతేనేం.. ఆకాశమంత ఎత్తున్న ధైర్యం తనది. ఆ ధైర్యంతోనే తనకున్న లోపాన్ని శాపంగా మారకుండా చూసుకుంది. ఇంట్లో వాళ్లకు భారం కాకూడదని, తనుకున్న కళనే ప్రొఫెషన్‌గా ఎంచుకుంది. పట్టుదలతో అందులోనే రాణిస్తోంది ఇరవైఏడేండ్ల దివ్య ప్రజాపతి.
సూరత్‌లోని జహంగీర్‌పురలో పుట్టి పెరిగింది దివ్య. తండ్రి అమ్రత్ టైలరింగ్ చేస్తాడు. తల్లి జ్యోత్స్న హౌస్‌వైఫ్. దివ్యకు నాలుగేండ్ల వయసులో రెండు కాళ్లు వంకరగా అయిపోయాయి. దాంతో చక్రాలున్న చిన్న స్టూల్ మీద కూర్చొని కదిలేది. మూడు ఫీట్ల ఎత్తు పెరిగిన దివ్య, తరువాత ఎత్తు పెరగడం కూడా ఆగిపోయింది. దివ్య అమ్మానాన్న డాక్టర్‌కు చూపించారు. ‘మీ కూతురు ఎదుగుదల ఆగిపోయింది. కానీ, మానసికంగా చురుగ్గా ఉంటుంద’ని ధైర్యం చెప్పాడాయన. దాంతో తనను అందరిలానే చూశారు. ఇంటర్ వరకు చదివిన దివ్య అందరూ హేళన చేస్తుండటంతో చదువు ఆపేసింది. చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడం దివ్యకి హాబీ. ఆ హాబీ మళ్లీ మొదలుపెట్టింది.
భారం కాకూడదని..
తండ్రి సంపాదనతోనే దివ్య వాళ్ల ఇల్లు గడిచేది. ఇప్పుడు తన తమ్ముడి సంపాదన కొంత హెల్ప్ అవుతోంది. ఇదంతా చూసి దివ్యకు ‘ఆర్థికంగా నేనెందుకు ఇంటికి భారం కావాలి. నేను ఏం చేయలేనా’ అనిపించింది. అప్పుడే తనకున్న హాబీతో డబ్బు సంపాదించొచ్చు అనుకుంది. యూట్యూబ్‌లో చూసి డ్రాయింగ్ స్కిల్స్ పెంచుకుంది. తరువాత పెన్సిల్‌తో బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అవి నచ్చి, మాకూ వేసివ్వమని అడిగేవాళ్లు పెరిగారు. పెన్సిల్ ఆర్ట్ వేసిన గిఫ్ట్‌ను పుట్టిన రోజులకి, పెండ్లిండ్లకి గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అలా ఇవ్వాలనుకున్న వాళ్లంతా దివ్యని బొమ్మలు గీయమని అడిగేవాళ్లు. వాటికి కొంత డబ్బు తీసుకునేది. అలా తనకున్న టాలెంట్‌తో పాపులారిటీ పెంచుకుంది దివ్య. ఊళ్లోనే కాకుండా చుట్టు పక్కల సిటీలనుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక్కో ఆర్ట్ వర్క్‌కు 1,500 నుంచి 3,000ల రూపాయల వరకు తీసుకుంటుంది.
‘శారీరకంగా ఎదగనంత మాత్రాన జీవితంలో ఏదీ సాధించలేమని అనుకోవద్దు. అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనమే గుర్తించాలి. దాంట్లోనే మన జీవితాన్ని వెతుక్కోవాలి’ అంటోంది దివ్య.