మోత్కుపల్లి ..దారెటు!..నామినేటెడ్​ పదవులపై సన్నగిల్లిన ఆశలు

మోత్కుపల్లి ..దారెటు!..నామినేటెడ్​ పదవులపై సన్నగిల్లిన ఆశలు
 
  •    ఎమ్మెల్సీ, దళితబంధు కార్పొరేషన్​ పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం
  •     నామినేటెడ్​ పదవులపై సన్నగిల్లిన ఆశలు
  •     నర్సింహులును మరిచిపోయిన హైకమాండ్​
  •     ఎమ్మెల్యే టికెట్​ఇస్తే పోటీ చేస్తానంటూ సంకేతాలు

నల్గొండ, వెలుగు: బీఆర్​ఎస్​లో సీనియర్​ నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవిష్యత్​ అగమ్యగోచరంగా మారింది. కేసీఆర్​ ఆహ్వానంతో రెండేండ్ల కింద బీజేపీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఆయనను హైకమాండ్​ పక్కన పెట్టేసింది. కేసీఆర్​తో, మోత్కుపల్లికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా బీఆర్ఎస్​లో కీలక పదవి లభిస్తుందని ఆయన వర్గం భావించింది. మొదట్లో దళితబందు కార్పొరేషన్ ​చైర్మన్​గా నియమిస్తారని ప్రచారం జరిగింది. తర్వాత నామినేటెడ్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ, ఈ రెండింట్లో ఏ పదవీ దక్కకపోవడంతో మోత్కుపల్లి అనుచరులు నారాజ్​గా ఉన్నారు. కేసీఆర్​ మీద ఉన్న నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపిక పట్టిన నర్సింహులు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ఎమ్మెల్యే టికెట్​ ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
 
ఆలేరులో ఆ ఇద్దరు కీలకం..
 
కేసీఆర్​ మీద నమ్మకంతో ప్రధాన పార్టీల నుంచి బీఆ ర్​ఎస్​లో చేరిన చాలా మంది సీనియర్లకు ఎలాంటి పదవులు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే ఓ వైపు మోత్కుపల్లి, మరో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​ సపోర్ట్​ కీలకం కానుంది. ఇక్కడ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వ విప్​ గొంగడి సునీత మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి గెలిస్తే క్యాబినెట్​లో బెర్త్​ కన్​ఫర్మ్​ అని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి ఆలేరుపై కన్నేశారనే చర్చ కాక పుట్టిస్తోంది. వాస్తవానికి మోత్కుపల్లికి, ఎమ్మెల్యేకు నడుమ ఇప్పటికైతే సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. మోత్కుపల్లి సూచన మేరకే ఆలేరు మార్కెట్​ కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే ఆయన సమీప బంధువులకు కట్టబెట్టారు. కానీ, రాజకీయ పదవి ఆశిస్తున్న మోత్కుపల్లి ఎన్నికల సమీపిస్తున్న టైంలో చేసిన కామెంట్లు ఎటువైపు దారితీస్తోయోననే ఆందోళన సునీత అనుచరుల్లో కనిపిస్తోంది. 
 
క్యాడర్​ పిలుపు మేరకే మోత్కుపల్లి ప్రకటన 
 
ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి, 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్​ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్​ గల్లంతవడంతో 2018లో బీఎల్ఎఫ్​ తరపున ఇండిపెండెంట్​గా పోటీ చేశారు. మళ్లీ ఇప్పుడు పార్టీ కేడర్ సూచనల మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తన రాజకీయ అనుభవం దృష్ట్యా ఉమ్మడి జిల్లాలోని ఏదైనా రిజర్వుడు నియోజకవర్గం, లేదంటే జనరల్​ నియోజకవర్గంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు ఆయన వర్గీయులు చెపుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఇస్తానని చెప్పిన దళిత బంధు కార్పొరేషన్​ చైర్మన్​, ఎమ్మెల్సీ పదవుల పైన కేసీఆర్​ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతోనే మోత్కుపల్లి ఈ తరహా కామెంట్లు చేసి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.