మోటరోలా ఎడ్జ్ 2026 లుక్ లీక్: మూడు కెమెరాలతో ఐఫోన్ డిజైన్‌తో వస్తున్న కొత్త ఫోన్!

 మోటరోలా ఎడ్జ్ 2026 లుక్ లీక్: మూడు కెమెరాలతో  ఐఫోన్  డిజైన్‌తో వస్తున్న కొత్త ఫోన్!

ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా సరికొత్త 'ఎడ్జ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కాకముందే దీనికి సంబంధించిన ఫోటోలు, డిజైన్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. రాబోయే ఈ సరికొత్త మోటరోలా ఎడ్జ్ 2026 మోడల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం....

సరికొత్త డిజైన్ మార్పులు
లీక్ అయిన ఫోటోలను బట్టి ఈ ఫోన్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మీరు మొదట గమనించే మార్పు 'ఫ్లాట్ డిస్‌ప్లే'. పాత మోడల్ ఎడ్జ్ 2025 లాగా దీనికి వంకరగా ఉండే అంచులు ఉండవు. దీనివల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు పొరపాటున చేయి తగిలి వేరే ఆప్షన్లు ఓపెన్ అయ్యే సమస్య ఉండదు. ఈ ఫోన్‌ను మరింత ఖరీదైన లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. లీక్ అయిన ఫోటోలలో 'షాంపేన్ గోల్డ్' రంగులో, వెనుక భాగం ప్రత్యేకమైన టెక్స్‌చర్  లేదా ఫ్యాబ్రిక్ లాంటి ఫినిషింగ్‌తో చాలా క్లాసీగా కనిపిస్తోంది.

కెమెరా సెటప్: ఫోన్ వెనుక భాగంలో  'L' ఆకారంలో అమర్చిన మూడు కెమెరాలు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ కెమెరా బాక్స్‌కు చుట్టూ మెరిసే గోల్డ్ కలర్ ఫ్రేమ్ ఇచ్చారు. ఫోన్ వెనుక భాగం మధ్యలో ఎప్పటిలాగే మోటరోలా లోగో ఉంది. ఫోన్‌కు కుడి వైపున వాల్యూమ్ పెంచే, తగ్గించే బటన్లతో పాటు పవర్ బటన్ ఇచ్చారు. అయితే ఈసారి ఎడమ వైపున అదనంగా మరో కొత్త బటన్ కనిపిస్తోంది, కానీ అది దేనికి ఉపయోగపడుతుందనేది ఇంకా తెలియలేదు.

 Motorola Edge 2025 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే:
ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, గత ఏడాది వచ్చిన ఎడ్జ్ 2025 ఫీచర్ల కంటే  మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. గత మోడల్ ఫీచర్లు చూస్తే....6.7 ఇంచుల pOLED డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ  కెమెరాతో  మూడు వెనుక కెమెరాలు, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,200mAh బ్యాటరీ (68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్), నీరు, దుమ్ము వల్ల పాడవకుండా ఉండేందుకు IP68 & IP69 రేటింగ్, రాబోయే ఎడ్జ్ 2026 మోడల్‌లో దీనికంటే మెరుగైన ప్రాసెసర్, కెమెరా క్వాలిటీ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ : ఏసీ ఆన్ చేసినా కరెంట్ బిల్లు పెరగకుండా ఉండాలంటే..

విడుదల ఎప్పుడంటే 
ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందనే దానికి సంబంధించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గత ఏడాది మోడల్ మే నెలలో విడుదలైనందున, ఈ కొత్త మోటరోలా ఎడ్జ్ కూడా  త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ దీని ధర, ప్రాసెసర్ ఇతర వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.