Little Hearts Review: ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’ రివ్యూ.. యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Little Hearts Review: ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’ రివ్యూ.. యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

‘90s బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన మూవీ ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’. డైరెక్టర్ సాయి మార్తాండ్ తెరకెక్కించాడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌‌‌‌లో నిర్మించిన ఈ మూవీకి, ‘90s బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్‌‌‌‌ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇవాళ శుక్ర‌వారం (సెప్టెంబర్5న) ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిర్మాత బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రాజీవ్ కనకాల, మౌళి తనూజ్ కనిపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌, స్కూల్ బ్యాక్‌‌డ్రాప్, యూత్‌‌ ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా మూవీ తెరకెక్కింది.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్స్తో మూవీపై మంచి అంచనాలే తీసుకొచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ సైతం ప్రదర్శించగా, మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఇవాళ థియేటర్స్కి వచ్చిన ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’ ఎలాంటి స్పందన దక్కించుకుందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

జియో సిమ్ రాకముందు జరిగే కథ ఇది. సైనిక్ పురిలో ఉండే అఖిల్ (మౌళి తనూజ్) చదువురాని ఇంటర్ విద్యార్థి. కొడుకు పనులతో తండ్రి గోపాల‌రావు (రాజీవ్ కనకాల) విసిగిపోతాడు. నీ మీద ఖర్చు పెట్టే ప్రతీది నాకు వృథానే అంటాడు. నాన్న తిట్లు అఖిల్ మీద ఏమాత్రం పనిచేయవు.

ఇక వాయుపురిలో ఉండే కాత్యాయని (శివానీ నాగరం) చదువులో వెనకబడటంలో అఖిల్ కంటే ముందుంటుంది. అయితే, ఇంటర్ చదువుతున్న అఖిల్.. ఎంసెట్‌లో ర్యాంక్ తెచ్చుకోలేకపోతాడు. ఇక పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. అయితే, అందుకు అఖిల్ తండ్రి ఒప్పుకోడు. లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపించి ర్యాంక్ తెచ్చుకోవాలని పట్టుబడతాడు. 

ఇదే క్రమంలో కాత్యాయని కూడా అదే కథ. కాత్యాయని పేరెంట్స్ ఇద్దరు డాక్టర్లే. తమ కూతురిని ఎలాగైనా డాక్టర్గా చూడాలనేది వారి కోరిక. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ నుంచి వీరి మధ్య మొదలైన పరిచయం.. ప్రేమగా ఎలా మారింది? చూడగానే లవ్‌‌లో పడిన అఖిల్కు.. ప్రపోజ్ చేశాక.. కాత్యాయ‌నికి సంబంధించిన షాకింగ్ విషయం తెలుసుకుంటాడు.

ఈ క్రమంలో వీరి ప్రేమ‌క‌థ‌లో ఓ ఊహించని  మలుపు మొదలవుతుంది. ఇంత‌కీ  కాత్యాయ‌ని విషయంలో తెలుసుకున్న ఆ షాకింగ్ నిజం ఏంటి? ఇరువురు పేరెంట్స్ వీరి ప్రేమని అంగీకరించారా లేదా? మరోపక్క వీళ్ళ చదువులు ఏమయ్యాయి? తల్లిదండ్రులు కోరుకొన్నట్టే అఖిల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాత్యాయని డాక్టర్ అయిందా? లేదా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 

విశ్లేషణ:

 ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’.. "నవ్వించే ఫ్రెష్ కామెడీ, ఎంటర్‌‌‌‌టైన్ చేసే యూత్ ఫుల్ కంటెంట్, చివర్లో ఆలోచింపజేసే మెసేజ్" ఇదే ఈ సినిమా బలం. అయితే, కథ మాత్రం కొత్తదని చెప్పలేం. గత సినిమాల మాదిరిలానే, రెగ్యులర్, రొటీన్ అంశాలతో సాగే టీనేజ్ లవ్ స్టోరి. ఇది చాలా సింపుల్ లైన్ అని చెప్పుకోవాలి. అందరికీ తెలిసిన అంశాలనే, కొత్తగా తమదైన శైలిలో చెప్పాలని చేసిన ప్రయత్నం.

అయితే, ఆడియన్స్ మాత్రం ఈ సినిమాతో ఎక్కడ డిస్సపాయింట్ అవ్వరు. క్రేజీ హిల్లేరియస్ డైలాగ్స్ తో, ఆద్యంతం నవ్వించే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగింది. ముఖ్యంగా మౌళి, శివానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. కాలేజ్ లైఫ్, కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనక తిరగడం, ఎమ్‌సెట్ ప్రిపరేషన్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిగతా గత సినిమాలకు భిన్నంగా కోచింగ్ సెంట‌ర్ నేప‌థ్యంలో సాగే అంశాలు ఆకట్టుకుంటాయి. ఎక్కడా అశ్లీలత ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా కథ, కథనంతో డైరెక్టర్ సాయి మార్తాండ్ చేసిన ప్రయత్నం చెప్పుకోదగినది.

హీరో మౌళి తనూజ్ పోషించిన అఖిల్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్ అని చెప్పాలి. తనదైన కామెడీతో సినిమాను భుజాలమీద మోశాడు. సెకండాఫ్ లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్గా వర్కౌట్ అయ్యింది. హీరో ఫ్రెండ్గా చేసిన యంగ్ యాక్టర్ జై కృష్ణ సినిమాకి మరో ఎసెట్ అని చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ మ్యాటర్ తెలిశాక.. అమ్మాయి ఇంట్లో స‌న్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే క్లైమాక్స్లో లైఫ్, కెరీర్పై చెప్పుకొచ్చిన మెసేజ్ ఆలోచింపజేస్తుంది.

ఎవరెలా చేశారంటే:

మౌళి తనూజ్, శివానీ నాగరం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మౌళి తనూజ్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అదిరింది. అఖిల్ పాత్రతో మంచి మార్కులు కొట్టేశాడు. తన వయసుకు తగిన కంటెంట్తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. కామెడీ, ఎమోషన్ సీన్స్లో తనదైన నటనను కనబరిచి సక్సెస్ అయ్యాడు. శివానీ నాగారం హీరో మౌళికి మంచి అస్సెట్గా నిలిచింది. తన పాత్రలోని కొంటెతనంతో అలరించింది. కొన్నిచోట్ల ఎమోషనల్ సీన్స్లో సైతం ప్రతిభ కనబరిచింది.

ఇక వీళ్ళ ఫాదర్స్గా నటించిన రాజీవ్ కనకాల, ఎస్.ఎస్.కాంచి తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు. మరి ముఖ్యంగా హీరో ఫ్రెండ్గా చేసిన యంగ్ యాక్టర్ జై కృష్ణ బాగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. మిగతా పాత్రల్లో నటించిన యూత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక వర్గం:

సింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఫీల్ అయ్యే కంపోజిషన్తో, హుషారైన బీజీఎంతో ఆకట్టుకున్నాడు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కథకు తగ్గట్టుగా ఉంది. శ్రీధర్ సొంపల్లి ఎడిటింగ్‌ మెప్పిస్తుంది. చివరగా.. డైరెక్టర్ సాయిమార్తాండ్‌ ఎంచుకున్న సబ్జెక్టు పాతదే అయిన.. కథకు రాసుకున్న డైలాగ్స్, ఎంచుకున్న కామెడీ, ఎమోషనల్ సీన్స్తో మెప్పించాడు. నిర్మాణ విలువలు ఒకే.