30 ఏండ్లు కష్టపడి 3 కి.మీ రోడ్డేసిన మౌంటెన్​ మ్యాన్​

V6 Velugu Posted on Aug 06, 2021

ఒడిశాకు చెందిన గిరిజనుడు హరిహర్​ బెహ్రా. ఇతన్ని ‘మౌంటెన్​ మ్యాన్ ఆఫ్ ఒడిశా’ అని పిలుస్తారు. హరిహర్ నయాగఢ్​ జిల్లాలోని ఒడగావ్​​ గిరిజన ప్రాంత నివాసి. ఒడగావ్​​ నుంచి వేరే ఊరికి కాలి నడకన వెళ్లడానికి కూడా దారి లేదు. అడవిగుండా రెండు కిలో మీటర్లు వెళితే, తులుబి అనే మరో గ్రామం వస్తుంది. అది కూడా కొండ ప్రాంతమే. అందువల్ల ఆ గ్రామాలకు దారి వేయడం చాలా కష్టం, అయినా ప్రయత్నిస్తామని అక్కడి ప్రభుత్వ అధికారులు చెప్పేవారు. కానీ, ఎన్ని రోజులు ఎదురుచూసినా లాభం లేకపోయింది.

దాంతో బాగా నిరాశ చెందిన హరిహర్​ ‘ప్రభుత్వం రోడ్డు వేస్తదో లేదో, ఎప్పుడు వేస్తుందోనని ఎదురు చూస్తూ కూర్చునే బదులు... మనమే దారి వేసుకుంటే సరిపోతుంది కదా’ అనుకున్నాడు. అదే విషయం వాళ్ల అన్నతో చెప్పాడు. రోడ్డు వేస్తే అందరికీ మంచిదే కదా అని ఇద్దరూ కలిసి పని మొదలుపెట్టారు. మొదట అడవిలో అడ్డుగా ఉన్న చెట్లను నరికి, శుభ్రం చేశారు. కొండలను బాంబులతో పేల్చి పగలకొట్టారు. పెద్ద పెద్ద రాళ్లు, బండలను తొలగించారు. అయితే బాంబులతో పేల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది అనిపించింది. దాంతో ఆ పద్ధతికి బదులు మరో టెక్నిక్​తో దారి వేయడం కంటిన్యూ చేశారు. ఈ అన్నదమ్ములు చేస్తున్న పని చూసి, కొంతమంది గ్రామస్తులు కూడా వారికి సాయం చేశారు. 

వాళ్లిద్దరూ కలిసి రోడ్డు వేస్తున్న టైంలోనే హరిహర్​ అన్న అనారోగ్యంతో చనిపోయాడు. అయినా, హరిహర్​ తన ప్రయత్నాన్ని మానుకోలేదు. ఒంటరిగానే పని చేశాడు. మొత్తానికి 30 ఏళ్లకు తన కష్టం ఫలించింది. దారి పూర్తయింది. కానీ, అంతటితో ఆగిపోలేదు హరిహర్. తులుబికి దగ్గరగా ఉన్న మరో ఊరికి దారి వేయాలని ఫిక్స్​ అయ్యాడు. అనుకున్న వెంటనే పంచాయితీ వాళ్లతో మాట్లాడి పనులు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్​ మీరు కష్టపడకండి.. మిగతా రోడ్డు​ను మేం వెంటనే కంప్లీట్​ చేయిస్తామని చెప్పింది.

Tagged Odisha, Road, Harihar Behera, built road through hills, nayagada

Latest Videos

Subscribe Now

More News