418 టీఎంసీల కృష్ణా నీళ్లు తరలించుకుపోయిన ఏపీ

418 టీఎంసీల కృష్ణా నీళ్లు తరలించుకుపోయిన ఏపీ
  • ఏపీతో పోలిస్తే మన వినియోగం పావు వంతే
  • వానాకాలంలో వాడుకున్నది 90 టీఎంసీలు మాత్రమే
  • 418 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ
  • యాసంగిలో వరి వద్దనుకోవడంతో ఇంకా తగ్గనున్న వినియోగం
  • కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సర్కార్​ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణానదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా రాష్ట్రం వాటిని వాడుకుంటలేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో నది పొంగిపొర్లి రిజర్వాయర్లు నిండినా వరదను మళ్లించుకోవడంలో రాష్ట్రం ఫెయిల్​అయింది. ఏపీతో పోల్చితే పావు వంతు కంటే తక్కువ నీళ్లను వానాకాలం సీజన్ లో వినియోగించుకుంది. ఏపీ, తెలంగాణకు కామన్‌‌ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ల నుంచి వానాకాలం సీజన్‌‌లో మన రాష్ట్రం కేవలం 90 టీఎంసీలు మాత్రమే తీసుకుంది. ఏపీ ఏకంగా 418 టీఎంసీల నీటిని తరలించుకుపోయింది. యాసంగి సీజన్‌‌లో వరి సాగు వద్దనడంతో ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌లో నీటి వినియోగం ఇంకా తగ్గనుంది.

పోతిరెడ్డిపాడు నుంచే 120 టీఎంసీలు 
ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి తీసుకున్న నీటికి సమానంగా కూడా మన రాష్ట్రం అన్ని ప్రాజెక్టుల నుంచి తీసుకోలేకపోయింది. కృష్ణా డెల్టా సిస్టం నుంచి తీసుకున్న నీటి లెక్కలతో చూస్తే సగం మాత్రమే వాడుకోగలిగింది. డిసెంబర్‌‌ 15 (బుధవారం)తో వానాకాలం పంట సీజన్‌‌ ముగిసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ130.92 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నట్టుగా కృష్ణా బోర్డుకు లెక్కలు చెప్పింది. ఇందులో ఫ్లడ్‌ డేస్‌ (ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన రోజుల్లో)లో తాము 23 టీఎంసీలు మాత్రమే తీసుకున్నట్టుగా పేర్కొంది. నిజానికి ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే ఫ్లడ్‌ డేస్‌లో 120 టీఎంసీలకు పైగా తరలించుకుపోయినట్లు మన ఇంజనీర్లు అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన త్రీమెన్‌ కమిటీ మీటింగ్​లో ఎత్తిచూపారు. యాసంగి సీజన్‌కు నీటి విడుదల కోసం నిర్వహించే సమావేశంలో దీనిపై చర్చించాలని కోరారు. నాగార్జునసాగర్‌ నుంచి 105.19 టీఎంసీలు తీసుకోగా, ఫ్లడ్‌ డేస్‌లో 8.19 టీఎంసీలు తీసుకున్నట్టు లెక్కలు చెప్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు 182 టీఎంసీల నీటిని తీసుకున్నారు. కానీ ఈ లెక్కలు కృష్ణా బోర్డుకు చెప్పలేదు. పట్టిసీమ నుంచి ఎన్ని గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు డైవర్ట్‌ చేశారనే విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదు.

యాసంగికి 45 టీఎంసీలు కూడా డౌటే
మన రాష్ట్రం ఈ వానాకాలంలో నాగార్జునసాగర్‌ వరద కాలువ ద్వారా 45 టీఎంసీలు తీసుకుంది. ఈ ఔట్‌లెట్‌ కింద 73 టీఎంసీలు వాడుకునేందుకు బోర్డు పర్మిషన్​ ఇచ్చినా 60 శాతం మాత్రమే వినియోగించింది. ఏఎమ్మార్పీ నుంచి 18 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 9 టీఎంసీలు తీసుకుంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 18 టీఎంసీల తీసుకుంది. మొత్తంగా 170 టీఎంసీల వినియోగానికి రిలీజ్‌ ఆర్డర్‌ ఉన్నా 90 టీఎంసీలు మాత్రమే తీసుకుంది. యాసంగిలో నాగార్జునసాగర్‌ 74 టీఎంసీలు వాడుకునేలా ప్లాన్​ రూపొందించినా ఎడమ కాలువ కింద 1.55 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి వేయాలని ప్రతిపాదించారు. దీంతో ఇంజనీర్లు అంచనా వేసిన 74 టీఎంసీల్లో 45 టీఎంసీలు కూడా వాడుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల కింద 2.55 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వడానికి 4.55 టీఎంసీలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏఎమ్మార్‌ శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎస్​ఎల్బీసీ) కింద 2.19 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు 22 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. ఈ ఆయకట్టు ఆరుతడి పంటలకు 10 టీఎంసీల నీళ్లు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన యాసంగిలో 70 టీఎంసీలకు మించి రాష్ట్రం వినియోగించుకోవడంపై ఇరిగేషన్‌ వర్గాల్లోనే అనుమానాలున్నాయి.

కృష్ణా ప్రాజెక్టులు ఎక్కడివక్కడే
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఎస్​ఎల్బీసీ టన్నెల్‌, రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీం పనులు పూర్తి చేయకపోవడంతోనే రాష్ట్రం కృష్ణా నీళ్లు వాడుకోవడంలో వెనుకబడింది. ఎస్‌ఎల్బీసీ పూర్తయితే గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశమున్నా ఆ ప్రాజెక్టుకు కనీసం కరెంట్‌ బిల్లులకు కూడా నిధులివ్వడం లేదు. దీంతో అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఇక పాలమూరు పనులు సరిగా నడుస్తలేవ్. ఈ ప్రాజెక్టు పెండింగ్‌ బిల్లులకు రూ.2 వేల కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ఏడాది కిందే ప్రకటించినా ఇప్పటికి పైసా ఇవ్వలేదు. దీంతో ఆ పనులు స్లోగా కొనసాగుతున్నాయి. సర్కారు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో వరద పోటెత్తినా నీళ్లు మళ్లించుకోలేకపోతున్నారు. దీన్నే ఏపీ వరంలా మార్చుకొని వరద నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు మళ్లించుకుపోతుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.