రాజకీయ ప్రత్యామ్నాయం.. ఉద్యమశక్తులు ఏకంగావాలె

రాజకీయ ప్రత్యామ్నాయం.. ఉద్యమశక్తులు ఏకంగావాలె

ఎన్నో త్యాగాలు చేసి, మరెన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో మొదలైన తుది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించింది. ‘మా భూములు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా వనరులు మాకే..’ అని గల్లీ నుంచి ఢిల్లీకి వినపడేలా నినాదాలు ఇచ్చారు. వెనుకబడిన ఆంధ్ర ప్రాంతాన్ని అన్ని వనరులున్న తెలంగాణ ప్రాంతంతో కుట్ర పూరితంగా కలిపి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన నాటి నుంచే  తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని ప్రజలు మొత్తుకున్నారు. ‘అమాయకపు ఆడ పిల్లను గడసరి అబ్బాయికిచ్చి పెండ్లి చేసినట్లు ఆంధ్రలో తెలంగాణ ను కలుపుతున్నాం” అని ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వాళ్లే కొట్టేశారు. వ్యవసాయ, వ్యాపార, రాజకీయ రంగాల్లో కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్లే ముందువరుసలో చేరి తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుని, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారు. అన్యాయాలపై, ఉద్యోగాలు కొల్లగొట్టడంపై 60 ఏండ్ల కిందట్నే ఉద్యమం వచ్చింది. ముల్కి, నాన్ ముల్కి (లోకల్, నాన్ లోకల్) ఉద్యమంతో మా ఉద్యోగాలు మాకు కావాలని లొల్లి జరిగింది. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం, మారోజు వీరన్న తెలంగాణ మహాసభ ఉద్యమం, పీపుల్స్ వార్ తెలంగాణ జనసభ ఉద్యమం ఇలా ఎన్నో సంఘాలు, ఉద్యమకారులు తెలంగాణలో జరుగుతున్న దోపిడీ గురించి, ఇక్కడి రైతుల ఆత్మహత్యల గురించి, ఉద్యోగాల గురించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేశారు. తెలంగాణలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన నక్సలైట్లు ఎంతో మంది అమరులయ్యారు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎందరు అమరులైనా దోపిడీ పాలన అంతం కాలేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గమని తుది దశ తెలంగాణ ఉద్యమం ప్రజలకు పిలుపునిచ్చింది. దశాబ్దాలుగా అణచివేతకు గురైన తెలంగాణ ప్రజలు వీరోచిత ఉద్యమానికి సిద్ధంగా ఉన్నా కేసీఆర్​ తెలంగాణ ఉద్యమాన్ని రాజీ ధోరణితో, లాబీయింగ్ లతో రాజీనామాలు ఎన్నికల చుట్టూ తిప్పారు. రాష్ట్ర సాధన కోసం 1,200 మంది యువత ఆత్మబలిదానాలు చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఎత్తేయాలని చూస్తే పెద్ద ఎత్తున యూనివర్సిటీ స్టూడెంట్లు ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.

అప్పుల తెలంగాణగా మార్చిన్రు
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ తప్పుడు ఎత్తుగడలను ఉద్యమ సంఘాల నేతలు విభేదించారు. సరైన సమయంలో సమర్థించారు. కేసీఆర్​ కన్నా ముందు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావంతో ఏకైక తెలంగాణ అస్తిత్వం కలిగిన పార్టీగా ఉన్నందున టీఆర్​ఎస్​ను గెలిపించారు. ప్రజల ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు.. అనేవి రాష్ట్రం రాగానే తీరునా అని తొందర పడవద్దని వేచిచూశారు. పాలోడి (సీమాంధ్ర కంపెనీలు మేఘా, నవయుగ)తో ప్రాజెక్టులు కట్టిస్తుంటే వాడిని వంచిండనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కాంట్రాక్టర్లను వంచిస్తున్నాడని ఆలస్యంగా తెలిసింది. బంగారు తెలంగాణ చేస్తానంటూ సీమాంధ్ర పెట్టుబడికి తొత్తుగా మారి సంపన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుంది. పేదల భూములను అడ్డికి పావుశేరుకు లాక్కుంటూ, ప్రభుత్వ భూములను వేలం వేస్తూ  ప్రభుత్వం రియల్ ఎస్టేట్  కంపెనీగా మారింది. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సీమాంధ్ర పార్టీలు లేదంటే సీమాంధ్ర తొత్తు టీఆర్ఎస్  ప్రత్యామ్నాయ పార్టీ పుట్టకుండా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘మా ఉద్యోగాలు.. మా నిధులు.. మా నీళ్లు మాకే, మా ప్రాజెక్టులు.. మా ఇండ్లు మేమే కట్టుకుంటాం’ అనే నినాదాలతో రాష్ట్రంలో మరో ఉద్యమం జరగాలి. ప్రజలందరికీ ఉచిత సమాన విద్య, వైద్యం కోసం మరో పోరాటం జరగాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి ధనవంతులు కేసీఆర్ కు సహాయపడి నష్టపోయారు. నేడు కేసీఆర్​ సీమాంధ్ర తొత్తుగా మారి సీమాంధ్రులకే అవకాశాలు కల్పిస్తూ ఇక్కడి కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆర్థిక సంక్షోభానికి కారకులయ్యారు. ఇక్కడి విద్యా సంస్థలకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్​మెంట్లను ఇవ్వకుండా తెలంగాణ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. 

నాయకులను సృష్టించాలి
ఎవరో వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసేకన్నా ఆలోచనపరులు, అంకితభావం కలిగిన వాళ్లు, త్యాగానికి సిద్ధమైన వాళ్లు మొదట కదలాలి. బలమైన శత్రువును మరో బలమైన మిత్రుడు ఓడించాలని ఇంతకాలం ఎదురు చూశాం. పాలకుల మీద ప్రజలకున్న అసంతృప్తి, వ్యతిరేకతను ఎప్పటికీ ఎవరో ఒకరు, ఏదో ఒక పాలక వర్గం స్వంతం చేసుకొని, వాడుకొని లబ్ధి పొందుతుంది... సామాన్య ప్రజల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. అందుకే గత 60 ఏండ్లుగా మనకు ఎదురైన అనుభవంతో పెద్ద నాయకుల కోసం, ప్రజాదరణ కలిగిన నాయకుల కోసం ఎదురు చూసి మోసపోయేకన్నా మనమే నాయకులను సృష్టించాలి. కష్టాలు, నష్టాలు చవిచూసిన ప్రజల నుంచి నాయకులను తయారు చేసుకోవాలి. అందుకోసం ఐక్యంగా కదులుదాం. చీమలకున్న క్రమశిక్షణ, ముందుచూపును మనమూ అలవర్చుకొని అంతిమంగా విజయం సాధించాలి. చలి చీమల చేత విష సర్పం చిక్కి చచ్చినట్లు మన చైతన్యం, ఐక్యత, పని విధానంతో తెలంగాణలోని దోపిడీ పాలనకు చరమగీతం పాడాలి. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనకు ఇంకా యుద్ధం మిగిలే ఉంది. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి.. అనే నినాదంతో పునఃనిర్మాణ పోరాటం జరగాలి.  ప్రజలను చైతన్యం చేసి మరో పార్టీ ఆవిర్భావానికి కృషి చేయాలి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినవారి వారసులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వారి వారసులు, తుది దశ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులు, 1969 ఉద్యమం నుంచి తుది దశ పోరాటంలో భాగమైన ఉద్యమకారులు, యువత, మహిళలు, స్టూడెంట్లు, రాజనీతిజ్ఞులు, మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు  మరో ఉద్యమానికి సిద్ధమై  విలువలతో కూడిన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం జరిగే యుద్ధంలో భాగమవ్వాలి. 

తెలంగాణ అంటే పాలన మారుడు కాదు
తెలంగాణ అంటే ఓ వర్గానికి రాజకీయ అధికారం కోసం కాదు. తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు బాగుపడాలి. విద్య, వైద్యం పేరుతో ఆంధ్ర సంస్థలు చేస్తున్న వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. సీమాంధ్ర పాలనలో విధ్వంసంపై పోరాటం చేసిన శక్తులు.. నేడు సీమాంధ్ర పార్టీలకు తొత్తుగా మారి దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ పై పోరాటం చేయాలి. ఆనాడు సీమాంధ్ర దోపిడీ వర్గాలకు సీమాంధ్ర పాలకులు కాపలా ఉంటే నేడు తెలంగాణ పాలకులే సీమాంధ్ర దోపిడీ వర్గాలకు కాపలా ఉంటున్నారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే తన ఎజెండా అని మాట్లాడిన కేసీఆర్​ సీమాంధ్ర పెట్టుబడి ఎజెండానే తన ఎజెండాగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారు.  తెలంగాణ అంటే పాలన మారడమే కాదు  సీమాంధ్ర దోపిడీ అంతమై సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ వచ్చేంతవరకు ఈ దోపిడీని కట్టడి చేయలేం. దేశంలో ఎమర్జెన్సీ విధించి నిరంకుశ పాలన సాగిస్తున్న టైంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నినదించిన సంపూర్ణ విప్లవ స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏకమై సీమాంధ్ర తొత్తుగా మారిన టీఆర్​ఎస్​ నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేసి సంపూర్ణ తెలంగాణ నిర్మాణం చేసుకోవాలి. ఆనాడు తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమశక్తులు ఏకమై స్వంత రాజకీయ ప్రత్యామ్నాయం పుట్టుక కోసం మంత్రసాని పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. 

ఏడేండ్లలో వెలగబెట్టింది ఏమీ లేదు
ఎన్నో ఆశలతో తెలంగాణ సాధించుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఏడేండ్లు అయినా వెలగబెట్టింది ఏమీ లేదు. ఉద్యోగాలు లేవు.. రైతు మరణాలు ఆగలేదు.. స్వయంపాలనలో తెలంగాణ ప్రజలకు స్వాభిమానం దొరకకపోగా మంత్రులు, ఎమ్మెల్యేలకే ఆత్మగౌరవం లేకుండా పోయింది. ప్రభుత్వ విద్య మూలకు పడి ప్రైవేట్ విద్య పెరిగి ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. వైద్యం అందక జనం చనిపోతున్నారు. విద్య కోసం అప్పులు, వైద్యం అందక చావులు, ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు, తిరగబడ్డ వారిపై అక్రమ కేసులు, ప్రశ్నించిన మంత్రుల బహిష్కరణ, ఎమ్మెల్యేలను బానిసలుగా చేసుకొని సాగిస్తున్న దుర్మార్గ పాలనపై మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- సాయిని నరేందర్, పొలిటికల్​ ఎనలిస్ట్