ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు కన్నుమూత

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు కన్నుమూత

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారమే డిశ్చార్జి అయ్యారు. అయితే అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతినగర్ లోని నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 800కు పైగా సినిమాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు.  తెలుగుతోపాటు తమిళం, మళయాలం, కన్నడ సినిమాలకు కూడా ఆయన వర్క్  చేశారు. గబ్బర్ సింగ్, రేసు గుర్రం, అదుర్స్, గోపాల గోపాల, ఖైదీ 150, బలుపు సహా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 

సినీ ఇండస్ట్రీలో తక్కవ మంది ఎడిటర్లకు మాత్రమే పేరొస్తుంది. అటువంటి వారిలో గౌతంరాజు ఒకరు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ఎడిటర్ గా నిలిచారాయన. చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన..ఆది సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇక గౌతంరాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి..వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.