ప్రజా సేవ చేసే రాకేశ్​రెడ్డిని గెలిపించండి : ధర్మపురి అర్వింద్​

ప్రజా సేవ చేసే రాకేశ్​రెడ్డిని గెలిపించండి : ధర్మపురి అర్వింద్​

​నందిపేట, వెలుగు: ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన అంకాపూర్​కు చెందిన పైడి రాకేశ్​రెడ్డిని భారీ మెజార్టీతో ఆర్మూర్​ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ కోరారు. శనివారం మండల కేంద్రంలో రాకేశ్​రెడ్డికి మద్దతుగా అర్వింద్​ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్​షోలో అర్వింద్​ మాట్లాడుతూ.. కూతురు కవితకు బంజారాహిల్స్​లో రూ.400 కోట్లతో, పెంపుడు కొడుకు జీవన్​రెడ్డికి ఆర్మూర్​లో రూ.100 కోట్లతో ఆర్మూర్​లో శాపింగ్​ మాళ్లు​కట్టించిన కేసీఆర్, ​నియోజకవర్గంలోని పేద ప్రజలకు మాత్రం ఒక్క డబుల్​ బెడ్​రూమ్​ ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని అన్నారు.

పదేండ్లుగా నియోజకవర్గంలో గుండాగిరి చేసిన జీవన్​రెడ్డి, ఇప్పుడు కుక్కర్లు, చీరలు పంచిపెట్టగానే ఓట్లేయడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​కు కేసీఆర్​ ఇంజినీర్ ​కావడం వల్లే అది రెండేండ్లకే కూలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆర్మూర్​లో బలమైన అభ్యర్థిని నిలిపి, తాను కోరుట్లకు వెళ్లానన్నారు.
 

తాము అధికారంలోకి వస్తే వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఏడాదిలోనే పసుపుకు రూ.20 వేల మద్దతు ధర వస్తుందన్నారు. రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ జీవన్​రెడ్డికి రెండుసార్లు అవకాశమిచ్చినా అభివృద్ధి చేయలేదని, తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పైడి రేవతి, సుచరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.