వైఎస్సార్​ను చంపించిందెవరో నాకు తెలుసు: అర్వింద్

వైఎస్సార్​ను చంపించిందెవరో నాకు తెలుసు: అర్వింద్
  •     నన్ను టార్గెట్ చేసి మాట్లాడితే చిట్టా విప్పుతా
  •     నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరిక 

నిజామాబాద్, వెలుగు :  ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్​రెడ్డిని హత్య చేయించిందెవరో తనకు తెలుసని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్​ చేశారు. తనని టార్గెట్​చేసి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని, అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. తన తండ్రి డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కాంగ్రెస్ ​లీడర్లందరి చరిత్ర అంతా తనకు తెలుసునని చెప్పారు. బుధవారం నిజామాబాద్​రూరల్​సెగ్మెంట్​బీజేపీ పార్టీ మీటింగ్​లో ఎంపీ అర్వింద్​పాల్గొని మాట్లాడారు. ‘నా జోలికి కాంగ్రెస్ ​లీడర్లు రావద్దు.. చరిత్ర చదివించుకోవద్దు’ అని ఘాటుగా స్పందించారు. పదేండ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకు తింటే.. మూడు నెలల కింద గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రేవంత్​రెడ్డి తెలంగాణను అధోగతి పట్టిస్తున్నారని విమర్శించారు. 

బీజేపీ లీడర్లపై ముఖ్యంగా ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఇక నుంచి ఊరుకోబోమని వార్నింగ్ ​ఇచ్చారు. అలాగే నిజామాబాద్ ​6వ డివిజన్​కు చెందిన ఇండస్ట్రియలిస్ట్​లక్కం భూమేశ్ బుధవారం ఎంపీ అర్వింద్​సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వీర శివాజీకి ప్రతిరూపమైన ప్రధాని మోదీ ఉండగా ఔరంగజేబు లాంటి రాహుల్​గాంధీ ఎందుకన్నారు. అభివృద్ధి, దేశరక్షణ మోదీకే సాధ్యమని, రాజకీయాలకతీతంగా మేధావులు, విద్యావంతులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ‘ఔర్ ఏక్​ బార్ ​మోదీ సర్కార్’​ నినాదంతో లోక్​సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు. నిజామాబాద్​అర్బన్​లో బీజేపీకి లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బస్సాపూర్​శంకర్, సుక్క మధు, సుధీర్, మల్లేశ్​యాదవ్, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.