‘ధాన్యం కొనుగోళ్లలో 1000 కోట్ల స్కాం‘

‘ధాన్యం కొనుగోళ్లలో 1000 కోట్ల స్కాం‘

నిజామాబాద్, వెలుగు: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కాంల సంస్కృతి వదలడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో రూ. 1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల స్కాం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‍ ఆరోపించారు. శుక్రవారం నిజామాబాద్ లోని 20వ డివిజన్‍  రేషన్‍షాపులో బియ్యం, కందిపప్పు పంపిణీని ప్రారంభించారు. నవీంపేట మండలంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలో  పేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుపై అదనంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తోందన్నారు. అంత్యోదయ కార్డు హోల్డర్లకు 35 కిలోలు ఇస్తోందన్నారు. జిల్లాలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మంత్రి ప్రశాంత్ రెడ్డి సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల్లో కడ్తా పేరుతో రైతును మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో రూ. 120 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు స్కాం జరుగుతోందని అన్నారు. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కడ్తా లేకుండా వందకు  వంద శాతం కొనుగోలు చేయాలని, ఆ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుందని అన్నారు. పేదలకు , వలస కార్మికులకు లాక్‍డౌన్ సమయంలో కడుపు నింపేందుకు కేంద్రం రాష్ట్రానికి రూ. 599 కోట్లిచ్చిందన్నారు. ఆ నిధుల్లో జిల్లాకు ఎన్ని తీసుకొచ్చారో, వాటినెక్కడెలా ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఉందని అన్నారు.

ఐటీ కాదు.. రైతుల గురించి మాట్లాడాలె

సమస్యలతో చిర్రెత్తి సిరిసిల్లలో ధాన్యం కుప్పలను కాలుస్తున్నారని, వాటిపై మాట్లాడకుండా ఐటీ కంపెనీల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు కేటీఆర్ ఘనతతో రావట్లేదని, 30 ఏళ్లుగా వస్తున్నాయన్నారు. ఐటీ సంగతి కేంద్రం చూసుకుంటుందని ముందు రైతుల గురించి పట్టించుకోవాలని అన్నారు. హైదరాబాద్ లో కరోనా టెస్టులు చేస్తలేరని, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.  హైదరాబాద్‍లోని కొన్ని సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్ కు ఫోన్ చేసి కరోనా టెస్టులు చేయొద్దని హెచ్చరిస్తున్నారని కొన్ని ఆస్పత్రి
యాజమాన్యాలు తనకు చెప్పాయన్నారు.