సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడని.. ఆయన ఓ పిరికి మనిషి అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తల కిందికి కాళ్ళు మీదికి చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవడని ఆర్వింద్ చెప్పారు. రాష్ట్రంలో సమయానికే ఎన్నికలు జరుగుతాయని.. ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. ఆ మరుసటి తెల్లారే తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందన్నారు. తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లు ఢిల్లీలో దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఎందుకు వేలు పెట్టారని విమర్శించారు. దేశంలో బీఆర్ఎస్ పెడితే తమకు వచ్చే ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అంతర్జాతీయ పార్టీ పెట్టినా.. అంతరిక్ష పార్టీ పెట్టినా బీజేపీకి అభ్యంతరం లేదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పైనా ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తుకువస్తారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీజనల్ పార్టీ అని అన్నారు. బీజేపీ సీజనల్ పార్టీ కాదని... ఏదో ఒక కార్యక్రమంతో నిరంతరం ప్రజల మధ్యే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పదేళ్లు దగ్గర పడుతున్నా అమలు కాని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తమని అర్వింద్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు మరచిపోవడంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ సారి ఎన్నికల్లో మెదక్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి నూటికి నూరు శాతం గెలుసుడు పక్కా అని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రభుత్వం పదవుల్లో, కౌన్సిల్లో అవకాశాలు ఉంటాయని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.