బీజేపీని టచ్​ చేస్తే.. మీ పతనం స్టార్ట్ అయినట్టే

బీజేపీని టచ్​ చేస్తే..  మీ పతనం స్టార్ట్ అయినట్టే

    సీఎం కేసీఆర్​కు ఎంపీ అర్వింద్ వార్నింగ్

నిజామాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను టచ్ చేస్తే  ఆ క్షణం నుంచే నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. బీజేపీతో పెట్టుకోవాలని చూడొద్దు’’ అని సీఎం కేసీఆర్ ను ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు. నిజామాబాద్ లో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక పూర్తయిన తర్వాత అర్వింద్ మీడియాతో మాట్లాడారు. ‘అడ్డదారిలో గెలవడం అలవాటైన టీఆర్ఎస్ ఆర్మూర్ లో  బీజేపీ కౌన్సిలర్‍ ను ముట్టుకున్నది. ఎట్ల ఆ కౌన్సిలర్ ను తెప్పించుకున్నవో అట్లనే ఆర్మూర్ కు తీసుకుపోయి బీజేపీకి అప్పజెప్పాలి. ఇదే వేదికగా కేసీఆర్​కు వార్నింగ్ ఇస్తున్నా’ అని ఎంపీ అర్వింద్ అన్నారు. అనవసరంగా బీజేపీతో పెట్టుకుని టీఆర్ఎస్ కు చావును కొని తెచ్చుకోవద్దని సూచించారు. టీఆర్‍ఎస్ పార్టీ పాతాళానికి పోయే టైమొస్తదని హెచ్చరించారు.

విలువల్లేని, దిగజారిన పార్టీ అది

టీఆర్ఎస్ పార్టీ విలువల పరంగా, రాజకీయంగా పూర్తిగా దిగజారిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 28 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా బీజేపీ నిలించిందన్నారు. 16 సీట్లతో ఎంఐఎం సెకండ్ ప్లేస్ లో ఉంటే, 13 సీట్లతో టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కు పడిపోయిందన్నారు. కేసీఆర్ హుందాతనం ప్రెస్‍మీట్ లకే పరిమితమైందని, రాజకీయాల్లో హూందాతనం అంటే  ఎలా ఉంటుందో నిజామాబాద్ లో జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ వ్యవహరించిన తీరును చూసి నేర్చుకోవాలని సూచించారు. అధికారం కోసం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను, ఒక ఇండిపెండెంట్ సభ్యుడ్ని కూడా కొనేశారని, ఎన్నికల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తనను గెలిపిస్తే బీజేపీకే మద్ధతిస్తానని ప్రచారం చేసుకుని గెలిచాక.. టీఆర్ఎస్ కు అమ్ముడు పోయాడని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని  మరోసారి నిరూపించుకుందని, ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్ముడు పోయిందని ఎంపీ అర్వింద్ అన్నారు.