కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి

కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి

జమ్మికుంట, వెలుగు : పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన దొంగలను జైల్లో పెట్టాలన్నారు. ప్రజాహిత యాత్ర శనివారం జమ్మికుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కొట్లాడేది ఒక్క బీజేపీయేనన్నారు. ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. బీజేపీ దేశవ్యాప్తంగా 350కి పైగా సీట్లు వస్తాయని, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట మేరకు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ రూ.500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని తిట్టేందుకే పరిమితమైంది తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, పట్టణ అధ్యక్షులు జీడిమల్లేష్ , ఆకుల రాజేందర్, సంపెల్లి సంపత్ రావు పాల్గొన్నారు.