డబ్బులు తీసుకుని కేసీఆర్‎కు గుణపాఠం చెప్పండి

డబ్బులు తీసుకుని కేసీఆర్‎కు గుణపాఠం చెప్పండి

కరీంనగర్: ఎన్నికలొచ్చినప్పుడు తన యాస, భాషతో అబద్ధాలు చెప్పి కేసీఆర్ మిమ్మల్ని మరోసారి మోసం చేస్తాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పథకాలు ఏమయ్యాయని అడిగినందుకే కేసీఆర్ ఈటలను బయటకు పంపించాడని ఆయన అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

‘ఆనాడు కేటీఆర్ బినామీ సంస్థ ఇంటర్మీడియట్ వాల్యుయేషన్‎లో చేసిన తప్పుల వల్ల 24 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. సిరిసిల్ల జిల్లాలోనూ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీనిపై ఆందోళన చేసిన తల్లిదండ్రులపై కేసీఆర్ లాఠీఛార్జీ చేయించాడు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడినందుకు అశ్వత్థామ రెడ్డిని తొలగించారు. పేదలు చనిపోతే, రైతులు చనిపోతే కేసీఆర్ మాట్లాడరు. కానీ పెద్దోళ్లు చనిపోతే బొకేలు ఇచ్చి ఫొటోలు దిగుతాడు. దేనికోసం మనం తెలంగాణ సాధించుకున్నాం? ఎవరికోసం తెచ్చుకున్నాం? ఎవరికి మేలు జరిగింది? 1400 మంది యువకుల బలిదానం వల్ల తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్య లాంటి వారి బలిదానాల వల్ల రాష్ట్రం వచ్చింది. మనం పోరాడితే వచ్చింది తప్ప.. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఏం త్యాగం చేశారు? అగ్గిపెట్టె దొరకని హరీశ్ ఏం త్యాగం చేశాడు? మనం పోరాడితే.. గడీల్లో కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తోంది. ఎన్నికలప్పుడు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి ఐదేళ్లు పాలన సాగించాలనేది కేసీఆర్ పాలసీ. 

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైంది? మీ ఇంట్లో అందరికీ ఉద్యోగం వచ్చింది. విద్యావంతులకు ఏవి ఉద్యోగాలు? సునీల్ నాయక్ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు. దళితబంధు అని అంటున్నాడు. ఎంత మందికి దళితబంధు ఇచ్చాడు? హైదరాబాద్‎లో వరదలొస్తే ఇంటికి పదివేలన్నాడు. నా సంతకం ఫోర్జరీ చేసి నేను వరద సాయం ఆపించాలని లేఖ సృష్టించాడు. నేను రాయలేదని... భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరకు రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు. అందరికీ దళితబంధు ఇవ్వాలని మేం కోరితే.. బీజేపీ లేఖ రాసి ఆపించిందంటున్నారు. దమ్ముంటే యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి ఆలయానికి రా.. వచ్చి మేం ఆపించామని నిరూపించు. దళితబంధు పథకం తెచ్చి 70 రోజులైంది.. డబ్బుల్లేక అకౌంట్లు ఫ్రీజ్ చేశాడు. సగం మంది డబ్బులు వాపస్ పోయాయి. రేపు ఎన్నికల తర్వాత కోర్టులో కేసులు వేయించి.. ఆ నెపం బీజేపీ పై వేస్తాడు. నాగార్జున సాగర్‎లో పోడు భూముల సమస్య తీరుస్తా అన్నాడు, అడ్రస్ లేదు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ అని అడ్రస్ లేకుండా పోయిండు. దుబ్బాక తర్వాత రైతు రుణ మాఫీ అన్నాడు, అడ్రస్ లేదు. ఇక్కడకు 27 తారీఖు వస్తాడట.. చిలుక పలుకులు చెబుతాడు. పిట్టకథలు, యాస, భాష, అబద్ధాలతో నమ్మించి మోసం చేస్తాడు.  ఈటల రాజేందర్ కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారు. మంత్రిగా అన్ని ఆస్పత్రులు తిరిగి పేదలను ఆదుకోవాలని తపన పడ్డారు. పథకాలు ఏమయ్యాయని ఈటల అడిగినందుకు బయటకు పంపించాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు కట్టించలేదన్నందుకు బయటకు పంపించాడు. ప్రశ్నించే వాడిని బయటకు పంపడం కేసీఆర్ నైజం. కష్టపడే ఈటల రాజేందర్‎ను గెలిపించాలి. డబ్బులు, మందు, మాంసం ఇస్తున్నారు. 20 వేల రూపాయలు ఇస్తున్నారు. 20 వేలు తీసుకోండి.. ఓటు మాత్రం ఈటలకు వేయండి. డబ్బులు తీసుకుని కూడా గుణపాఠం చెప్పారని.. కేసీఆర్‎కు బుద్ధిరావాలి. అప్పుడే కేసీఆర్ బయటకు వస్తాడు. రేషన్ బియ్యం కోసం కిలోకు 29 రూపాయలు కేంద్రం ఇస్తోంది. అనేక పథకాలకు ప్రతి పైసా మోడీ ఇస్తున్నా.. ఫొటో మాత్రం కేసీఆర్ పెట్టుకుంటుండు. ఈటలను గెలిపిస్తామని ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టీఆర్ఎస్ వాళ్ల మాయమాటలు విని మోసపోకండి. గంపగుత్తగా ఈటలకే మీ ఓటు వేయండి’ అని బండి సంజయ్ అన్నారు.

For More News..

కాంగ్రెస్‎ను, టీఆర్ఎస్‎ను పోషించేది చంద్రబాబే

కొడుకు, మనవడు రాష్ట్రాన్ని ఏలాలనేదే కేసీఆర్ ఎజెండా

షారూఖ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు