కాంగ్రెస్ రూ.54 కోట్ల ప్రజాధనం కాపాడిందని కేటీఆర్ తెలుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్

కాంగ్రెస్ రూ.54 కోట్ల ప్రజాధనం కాపాడిందని కేటీఆర్ తెలుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్న అమృత్ 2.0 కాంట్రాక్ట్ 2023 సెప్టెంబర్ లోనే రూ. 3656 కోట్లకు జరిగిందనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీటెండర్లను నిర్వహించి రూ. 54 కోట్లను తగ్గించి రూ. 3602 కోట్లకు కాంట్రాక్టులు అప్పగించారని వెల్లడించారు. రూ. 54 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం కాపాడిందని తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది ఏండ్లు దోచుకున్న కేటీఆర్.. పది నెలలుగా అధికారం లేక దోచుకోవడానికి వీలు కావట్లేదని అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదని అన్నారు.  

ALSO READ | కులగణన చేయకుంటే నేను రిస్క్‌లో పడతా: పీసీసీ మహేష్ కుమార్

గత సెప్టెంబర్ లోనే ఈ కాంట్రాక్టును కేటీఆర్ మిత్రులైన ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి, సత్యం రామలింగ రాజు కొడుకుకి, మెగా కృష్ణారెడ్డికి మూడు ప్యాకేజీల ద్వారా టెండర్ ఇచ్చారని తెలిపారు.  కమిషన్లకు అలవాటు పడిన కేటీఆర్ ప్రాజెక్టులు వాళ్ల చేతుల నుంచి పోవడం మింగుడు పడకుండా ఉందన్నారు. పైసలకు అలవాటు పడిన కేటీఆర్ రోజు ఎదో ఒక విషయంలో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి దోచుకు తిని 7 లక్షల కోట్లు అప్పుచేశారని.. అయినా ఇంకా సరిపోవట్లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్ మంచి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే ప్రజలు మెచ్చుకుంటారని హితవు పలికారు.