ఉద్యమకారుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్​ది: అర్వింద్

ఉద్యమకారుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్​ది: అర్వింద్
  •    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్​
  •     బలిదానాలకు సోనియానే కారణం
  •     రెచ్చగొట్టింది కేసీఆర్ ఫ్యామిలీ అని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ దని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. యువకుల ఆత్మబలిదానాలు, ప్రాణత్యాగాలకు కారణం సోనియాగాంధీ అని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ రెచ్చగొట్టడం వల్లే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. బుధవారం పార్లమెంట్ ఎదురుగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని, ఎక్కడా గొడవలు జరగలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ పార్లమెంట్ లో ప్రస్తావించారన్నారు. ఆయన మాటలను కాంగ్రెస్, బీఆర్ఎస్  వక్రీకరిస్తున్నాయని ఫైరయ్యారు. ప్రధాని మాటలను అర్థం చేసుకోలేని స్థితిలో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. 

రాష్ట్రాన్ని లూటీ చేశారు..

రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సారాను ఏరులై పారిస్తున్నదని అర్వింద్ విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్ల  పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. యూనివర్సిటీలను నాశనం చేశారని,   విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వడం లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాటలను తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదన్నారు. 

కేంద్రం మహిళా బిల్లును తీసుకురావడంలో తన పాత్ర ఉన్నట్టు చేస్తున్న  డ్రామాలను ఆపాలని ఎమ్మెల్సీ కవితకు అర్వింద్​ సూచించారు. ఆమె ఒత్తిడితో కేంద్రం మహిళా బిల్లు తెచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా లక్ష ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు