మాటిచ్చిన పసుపు బోర్డు తెచ్చిన: అర్వింద్

మాటిచ్చిన పసుపు బోర్డు తెచ్చిన: అర్వింద్
  • రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది
  • మోదీ ఇందూరు టూర్​ను సక్సెస్​ చేద్దాం: అర్వింద్​
  • డెంగ్యూ దోమల లెక్క కల్వకుంట్ల ఫ్యామిలీని తరిమేస్తరు
  • కవిత కంటే ముందు కేటీఆరే​ జైలుకు వెళ్తడేమో
  • దొరతనం తాటతీసేదాకా వదిలిపెట్టబోనని హెచ్చరిక

నిజామాబాద్, వెలుగు: పాలమూరు వేదికగా ప్రధాని మోదీ చేసిన పసుపు బోర్డు ప్రకటన ఉత్తర తెలంగాణ రైతుల్లో ఆనందం నింపిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. కరోనా​కారణంగా  బోర్డు ఏర్పాటు రెండేండ్లు ఆలస్యమైనా ప్రధాని మోదీ మాత్రం రైతుల చిరకాల కోరికను నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్​లో అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. మోదీ భక్తుడిగా తాను పాలిటిక్స్​లోకి వచ్చానని అన్నారు. ‘‘కాపు బిడ్డగా రైతు ప్రయోజనాల కోసం పసుపు బోర్డు తెచ్చిన. నన్ను ఎంపీగా గెలిపించినందుకు హామీ నెరవేర్చిన. ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టిన రోజు నుంచి పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసిన. బోర్డును ప్రకటించిన ప్రధాని మోదీకి ట్విట్టర్​లో కృతజ్ఞతలు తెలుపగా ఆయన చేసిన ప్రతి ట్వీట్​నన్ను చెప్పలేని సంతోషానికి గురిచేసింది’’ అని పేర్కొన్నారు. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ‘‘67 ఏండ్ల వయసు ఉన్న ఓ రైతు.. రాజకీయ పార్టీల లీడర్లపై భరోసా కలిగిందని మెసేజ్ పెట్టారు. పసుపు బోర్డు వచ్చేదాకా చెప్పులు ధరించనని ఏండ్ల కింద ప్రతినబూనిన ముత్యాల మనోహర్​రెడ్డిని ఒకసారి కలిసిన సందర్భంలో చెప్పులు వేసుకునేలా చేస్తానని మాటిచ్చిన. ఇప్పుడా మాట నెరవేరింది. దీనికంతటికీ ప్రధాని మోదీ కారణం. మంగళవారం ప్రధాని మోదీ నిజామాబాద్ వస్తున్నరు. ఆయనకు స్వాగతం తెలిపి ధన్యవాదాలు చెప్పేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు తరలిరావాలి” అని అర్వింద్​ కోరారు. 

కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తరిమేస్తరు

డెంగ్యూ దోమలను తరిమినట్లు ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తరమడం ఖాయమని అర్వింద్​ అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తుంటే సీఎం కేసీఆర్​ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్​ను రమ్మను కేటీఆర్..! ప్రధాని నీడపడితే మీ కొన్ని పాపాలైనా కడిగినట్లయితయ్’’ అని అన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ మోసం చేస్తున్నారన్న మంత్రి కేటీఆర్​ కామెంట్లపై ఎంపీ అర్వింద్​ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అని   ప్రశ్నించారు. రాజకీయాల ద్వారా దోచుకోవడానికి కల్వకుంట్ల కుటుంబం వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రమంతా కేసీఆర్​ మద్యం పారిస్తుంటే..  ఆయన కూతురు కవిత లిక్కర్​ స్కామ్​ వరకు తీసుకెళ్లారని అర్వింద్​ దుయ్యబట్టారు. తొమ్మిదేండ్లలో రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ వడ్ల కొనుగోలుకు కేంద్రం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని, కానీ రాష్ట్ర సర్కార్​ మాత్రం బ్లాక్ మార్కెట్​ చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘ఆ లెక్కా పత్రాలన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నయ్​. కవిత కంటే ముందు కేటీఆర్​ జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు” అని అన్నారు.  ‘‘పెట్రోల్, డీజిల్​లో కలిపే ఇథనాల్​కు బాగా డిమాండ్‌ ఉంది. స్టేట్​లో 17 ఇథనాల్​ ఫ్యాక్టరీలు నిర్మించడానికి పారిశ్రామికవేత్తలు రాగా కంపెనీలో కవిత వాటా డిమాండ్​చేయడంతో వెనుదిరిగి పోయారు.. కమీషన్ల స్థాయి నుంచి కంపెనీల్లో వాటాలు అడిగే స్థాయికి అవినీతిని చేర్చారు. సోనియా, రేవంత్ ​ఇతర లీడర్లు ఎవరైనా వారి రాజకీయ విమర్శలకు సమాధానం ఇచ్చే నా భాష వేరుగా ఉంటుంది.. కానీ కల్వకుంట్ల కుటుంబంలోని ముగ్గురిపై మాత్రం కఠినమైన ఘాటు భాష వాడతా.. వారు గద్దె దిగేదాకా వాడుతా.. కల్వకుంట్ల కుటుంబంలోని దొరతనం తాటతీసి డోలుకు కట్టేదాకా నేను వదిలపెట్ట” అని అర్వింద్​ హెచ్చరించారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో గంజాయి బిజినెస్​కు మార్కెటింగ్​మేనేజర్​గా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మోహన్​రెడ్డి, బుస్సాపూర్​ శంకర్​, నూతుల శ్రీనివాస్​రెడ్డి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 

పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తే మా లక్ష్యం
ట్విట్టర్​లో ఎంపీ అర్వింద్​ పోస్ట్ కు ప్రధాని మోదీ రిప్లై

న్యూఢిల్లీ, వెలుగు: పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఏమైనా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను గుర్తుచేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మహబూబ్​నగర్​లో ప్రధాని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తూ.. సోమవారం నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్​లో చేసిన పోస్ట్ పై ప్రధాని మోదీ స్పందించారు. "మా రైతుల శ్రేయస్సుకే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. నేషనల్ టర్మరిక్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడం ద్వారా.. మా పసుపు రైతుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడం మా లక్ష్యం. ముఖ్యంగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ ప్రయోజనాలు అపారం. మా పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మేము ఏమైనా చేస్తాము..’ అని ప్రధాని రిప్లై ఇచ్చారు.