పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎంపీ డీ కే అరుణ

పథకాలపై ప్రజలకు అవగాహన  కల్పించాలి : ఎంపీ డీ కే అరుణ
  •     ఎంపీ డీ కే అరుణ

నారాయణపేట, వెలుగు : పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్‌‌పర్సన్ డీ.కే. అరుణ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను సూచించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) మూడో సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వివిధ శాఖల ద్వారా అమలు అవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. 45 శాఖల పరిధిలో కొనసాగుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను పారదర్శకంగా అమలు చేసి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని సివిల్ సప్లై అధికారులను ప్రశ్నించారు. 

ఇకపై సీఎం ఫోటోతో పాటు ప్రధాన మంత్రి ఫోటో కూడా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంకుల నిర్మాణ పనుల పురోగతిపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్  సీహెచ్. ప్రియాంక మాట్లాడుతూ...దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని,ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు  సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు చేపట్టే పనులు ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దిశ కమిటీ సభ్యులు , అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎస్. ఈ లు, డీ. ఈ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.