అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం
  • కేంద్ర పథకాలను సరిగా అమలు చేయడంలేదని అసహనం
  • తనకు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఫైర్​

వనపర్తి/మదనాపూరు/మహబూబ్ నగర్ అర్బన్/నర్వ, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపాలిటీలో ‘అమృత్ 2.0’ పనులను పరిశీలించిన ఆమె, ఎంపీకి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని అధికారులను నిలదీశారు.

రాజకీయ ఒత్తిళ్లతో నిధులను పక్కన పెడితే సహించేది లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. కొత్తపల్లి బ్రిడ్జి పనులను తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ, దీనిపై చర్చకు రావాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఆమె సవాల్ విసిరారు.

బీజేపీ,  కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ

అమరచింత మండల కేంద్రంలో రూ.3.14 కోట్లతో చేపట్టనున్న పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి ఈ పనులకు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ ఎంపీ డీకే అరుణ చేయడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఎంపీ డీకే అరుణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర నిధులతో జరిగే పనులకు రాత్రికి రాత్రే శిలాఫలకాలు వేయడం అహంకార పూరిత చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు తాను భయపడబోనని 
స్పష్టం చేశారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం

గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం చక్కని వేదికని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ స్టేడియంలో జరిగిన రెండో రోజు పోటీలను ఆమె ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ లాంటి పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, టీ-షర్టులను పంపిణీ చేశారు. 

 పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

నర్వ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎంపీ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాగిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించిన ఆమె, ప్రజలకు రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నర్వ, లంకాల గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, లంకాలలో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. క్రీడాకారులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.