మహబూబ్ నగర్ లో ధన్ -ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ లో ధన్ -ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డీకే అరుణ కోరారు. పీఎం ధన్ -ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్ ను శనివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట మండలం జాజాపూర్  గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్  సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్  ప్రణయ్  కుమార్, నోడల్  అధికారి సాయిబాబా, డీఏవో జాన్  సుధాకర్ తో కలిసి పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోని 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారని, ఇందులో నారాయణపేట జిల్లా ఉండడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద ఎంపికైన నాలుగు జిల్లాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆరేళ్ల పాటు కొనసాగుతుందని, ప్రతి ఏటా రూ.960 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

జిల్లాలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ రుణాలు వస్తాయన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈ పథకాన్ని జిల్లాలో సక్సెస్​ చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు  నాగురావు నామాజీ, రతంగ్  పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ప్రధాన కారదర్శులు తిరుపతి, లక్ష్మీ శ్యాంసుందర్  గౌడ్, సిద్ధి వెంకట్రాములు పాల్గొన్నారు.

గద్వాల: రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పీఎం ధన్​ధాన్య కృషి యోజన ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్  సంతోష్ అన్నారు. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లా ఎంపిక కాగా, కలెక్టరేట్ లో ఆఫీసర్లు, రైతులు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. వ్యవసాయ శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, ఉద్యానవన, నీటి పారుదల, బ్యాంకింగ్  శాఖలు సమన్వయంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి 20 నుంచి 30 మంది రైతులను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, మిగిలిన రైతులకు స్ఫూర్తినివ్వాలని కోరారు. అడిషనల్  కలెక్టర్  నర్సింగరావు, ఏడీఏ సంగీత లక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు.

కందనూలు: ధన్​ధాన్య కృషి యోజన పథకం కింద నాగర్ కర్నూల్  జిల్లా ఎంపిక కావడం హర్షణీయమని కలెక్టర్  బదావత్  సంతోష్  అన్నారు. పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ధన్​ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్​ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపడితే మరింత లాభాలు పొందవచ్చన్నారు. అంతకుముందు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. డీఏవో యశ్వంత్ రావు, డీఆర్డీవో చిన్న ఓబులేషు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్  పాల్గొన్నారు.