
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, అది పాకిస్తాన్‌కు తొత్తుగా మారిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఆ పార్టీ మత రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘పౌరసత్వ సవరణ చట్టం–2019పై మేధావుల సమావేశం’ నిర్వహించారు. నరసింహారావు ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నార్సీపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్ చేసిన తర్వాతే రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో స్పందించారని.. ఇమ్రాన్‌ఖాన్‌కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసమే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. నిజమైన సెక్యులర్ విధానాలు అవలంబించేది బీజేపీయేనని పేర్కొన్నారు. సీఏఏపై కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా అల్లర్లు జరగడం లేదని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోటే చెలరేగుతున్నాయని, వాటి వెనుక కాంగ్రెస్ ప్రమేయం ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చట్టం గురించి వివరిస్తామని, తప్పుడు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చెంపలు వాయిస్తామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశానికి మరోసారి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఇదే పని చేసి ఉంటే లౌకికవాదం అని చెప్పుకునేదని.. మోడీ చేశారు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్ధికోసమే విమర్శలు
ఎంఐఎం పార్టీ ఆఫీస్ దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీతో జాతీయ గీతం పాడించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు కర్రుగాల్చి వాతలు పెట్టామన్నారు. దేశంలో అనేక సమస్యలకు పౌరసత్వ సవరణ చట్టం పరిష్కారం చూపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందేందుకు సీఏఏను వక్రీకరిస్తున్నాయన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, వేరే దేశంలో పుట్టిన నాయకురాలు కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలని కామెంట్ చేశారు.
కొన్ని పార్టీలు సీఏఏ, ఎన్నార్సీపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ మజ్లిస్‌పార్టీకి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.