ఈటలతో ఫోన్‌లో మాట్లాడా.. త్వరలోనే చర్చలు జరుపుతా..

ఈటలతో ఫోన్‌లో మాట్లాడా.. త్వరలోనే చర్చలు జరుపుతా..

‘ఈటలతో నేను ఫోన్‌లో మాత్రమే మాట్లాడాను. డైరెక్ట్‌గా కలవలేదు. కానీ, ఈటలతో చర్చలు జరుపుతాను’ అని ఎంపీ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా.. ఇదే విషయంపై కిషన్ రెడ్డి స్పందించారు. 

‘ఇప్పటి వరకు నేను ఈటలను కలవలేదు. ఫోన్‌లో మాత్రమే మాట్లాడాను. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతాను. నన్ను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమే. అసెంబ్లీలో ఈటలతో కలసి 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈటలను ఎప్పుడు కలవాలనేది  నిర్ణయించుకోలేదు. అందరిని కలుస్తున్నానని.. మిమ్మల్ని కూడా కలుస్తానని ఈటల చెప్పారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే.. పోటీ చేయాలా? లేదా? అనేది మాపార్టీలో చర్చించలేదు. మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు? నేను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్ళను దేవుడే చూసుకుంటాడు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తాను’ అని ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు.