కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి :  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
  •     ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు : కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్​, మద్నూర్ మండలాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.  మద్నూర్​లో కాంగ్రెస్ సర్పంచ్​అభ్యర్థి ఉషా సంతోష్​ను గెలిపించుకోవాలని, మద్నూర్​ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, ఇండస్ట్రీయల్ హబ్​గా మారుస్తామన్నారు. 

మద్నూర్​లో  సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.20 కోట్లు మంజూరు చేశానని తెలిపారు. మరో రూ. 95 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మద్నూర్​ మండల కేంద్రంలో 112 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. స్థలం లేని వారి కోసం ప్రభుత్వం 10 ఎకరాలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 

గతంలో నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఇక్కడి ఎమ్మెల్యే షిండే నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్​కు వెళ్లిందని, దాన్ని తిరిగి మద్నూర్​కు తీసుకొచ్చానని అన్నారు.  ఎమ్మెల్యేకు కాంగ్రెస్​ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో జుక్కల్​, మద్నూర్​ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.