కేసీఆర్‌‌ కుటుంబం  అక్రమ ఆస్తులు బయటపెడ్తా :  వెంకట్ రెడ్డి 

కేసీఆర్‌‌ కుటుంబం  అక్రమ ఆస్తులు బయటపెడ్తా :  వెంకట్ రెడ్డి 

నల్గొండ అర్బన్/తిప్పర్తి, వెలుగు: కేసీఆర్ కుటుంబం అక్రమ ఆస్తుల చిట్టా తన దగ్గర ఉందని,  అధికారంలోకి రాగానే  బయటపెడుతానని నల్గొండ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. శనివారం తిప్పర్తి మండలంలోని పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, సోమోరిగూడెం, వెంకటాద్రిపాలెం, గడ్డి కొండారం, జంగారెడ్డిగూడెం, మర్రిగూడెం, ఇండ్లూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదని విమర్శించారు. అమరవీరులు,  ఉద్యమకారుల కుటుంబాలను విస్మరించారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం,  అందరికీ రేషన్ కార్డు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి  హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఉద్యోగాల భర్తీలో  పూర్తిగా విఫలమయ్యారని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మండిపడ్డారు.  ధరణి పెద్ద స్కాం అని,  కాంగ్రెస్​ పాలనలో పేదలకు ఇచ్చిన భూములను గుంజుకున్నారన్నారు.  కాంగ్రెస్​ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల  అమలుకు కేసీఆర్‌‌ అక్రమంగా దోచుకున్న సొమ్ము సరిపోతుందన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని, అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్‌కు ఓటేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల  అధ్యక్షుడు జూకూరి రమేశ్, జడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి,  సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.