కోమటి రెడ్డి బ్రాండ్​ను బ్రాందీ షాపు అని ఎట్లంటవ్​?

కోమటి రెడ్డి బ్రాండ్​ను బ్రాందీ షాపు అని ఎట్లంటవ్​?
  • నన్ను రెచ్చగొట్టకు: వెంకట్​రెడ్డి
  • నేను ఎన్​ఎస్​యూఐలో ఉన్నప్పుడు నువ్వు పుట్టినవో లేదో
  • టీడీపీకి రిజైన్ చేసినంకనే కాంగ్రెస్​లో చేరినవా?
  • రాజగోపాల్​ వేరే పార్టీలోకి పోతే నాకు సంబంధమేంది? 
  • ఇద్దర్నీ కలిపి ‘మీరు’ అని ఎట్లంటవ్​? 
  • నన్ను ఒక్క మాటన్నా పడే ప్రసక్తే లేదు

హైదరాబాద్​ : కోమటి రెడ్డి బ్రదర్స్, బ్రాండ్​పై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, తనను రెచ్చగొట్టొద్దని ఆయన హెచ్చరించారు. ‘‘మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంలో  ‘మీరు’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. పీసీసీ చీఫ్​ ఇలా మాట్లాడడం తప్పు. మీరు, మీరు అంటే కోమటి రెడ్డి బ్రదర్స్ ను అన్నట్లా? వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ నిజాయితీగా ఉన్న వాళ్లే. కోమటిరెడ్డి బ్రాండ్ ను బ్రాందీ షాపు అని ఎట్లంటవ్​? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని  వెంకట్​రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో యంగ్ ఇండియా ఆఫీసుపై ఈడీ చర్యలు, ఏఐసీసీ ఆఫీసు దగ్గర పోలీసుల మోహరింపునకు నిరసనగా చేపట్టిన ధర్నాలో వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎన్ఎస్ యూఐ యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రేవంత్ పుట్టారో లేదో కూడా తెలియదని, 34 ఏండ్లు పార్టీ కోసం రక్తం ధారపోసిన తనను అవమానపరచడం మంచిది కాదన్నారు. ‘‘రేవంత్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నాపై ఒక్క మాట అన్నా పడే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన కామెంట్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే పార్టీ, ప్రజలు స్పందిస్తారని హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, తాను ఎవరికీ ఫిర్యాదు చేయనన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు.

టీడీపీకి రిజైన్ చేసే కాంగ్రెస్​లో చేరినవా?
టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ పార్టీలో చేరారని వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘నిజంగా టీడీపీకి రిజైన్ చేశాకే కాంగ్రెస్​లో చేరారా?’’ అని ప్రశ్నించారు. కనీసం ఏడాది పాటు కంటీన్యూగా ఎమ్మెల్యేగానైనా రేవంత్​రెడ్డి ఉన్నారా? అని నిలదీశారు.  56 ఏండ్ల వయసున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఒక జాతీయ పార్టీ తరఫున పోరాడుతున్నారని అన్నారు. ‘‘రాజగోపాల్​ తనకు ఇష్టం ఉన్న పార్టీలోకి పోయారు. ఆ అంశానికి, నాకు సంబంధం లేదు. బ్రాండ్ కాదు.. బ్రాందీ షాపు అంటూ రేవంత్​ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. ఇంజనీరింగ్ చదువుల తర్వాత సొంతంగా కాంట్రాక్ట్ లు చేసుకొని పైకి వచ్చాం. ఎవర్నీ మోసం చేయలేదు. బ్రదర్స్ ను ఇద్దర్నీ కలుపుతూ రేవంత్​ అన్న వ్యాఖ్యల్ని విత్ డ్రా చేసుకోవాలి” అని డిమాండ్ చేశారు. రాజగోపాల్​ పార్టీ వీడిపోతే ఆయనను పేరు పెట్టి విమర్శించాలని, ‘మీరు’ అనే పదాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. 

ధర్నాకు రాకుండా రేవంత్, ఉత్తమ్ ఎటు పోయారు?
ఈడీ చర్యలు, పోలీసుల మోహరింపునకు నిరసనగా చేపట్టిన ధర్నాలో దేశంలోని 52 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురిలో తాను మాత్రమే పాల్గొన్నట్లు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారు. ‘‘యంగ్ ఇండియా సంస్థను సీల్ చేస్తే పీసీసీ చీఫ్​, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి ఢిల్లీలోనే ఉన్నా ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించారు. పదవి ఇయ్యకున్నా... పార్టీకోసం కష్టపడి పని చేస్తున్నట్లు తెలిపారు. ‘‘జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరిలో ఎన్ని మున్సిపాలిటీలు గెలిచారో రేవంత్  చెప్పాలి. భువనగిరి నియోజక వర్గంలో ఎన్ని గెలిచారో చూడాలి. ఆ లెక్క చూస్తే కోమటి రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉంటే నష్టమేంది?” అని ఆయన ప్రశ్నించారు. 

తమ్ముడి విషయంలో నో కామెంట్స్​
తన తమ్ముడు రాజగోపాల్ ​రెడ్డి, మునుగోడు ప్రచారం విషయంలో ‘నో కామెంట్స్’  అని వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘నేను పార్టీ సాధారణ  కార్యకర్తను, పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తా. మాది ఉమ్మడి కుటుంబం. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ ఒక స్ట్రాటజీ కమిటీ వేసింది. ఆ కమిటీ చూసుకుంటుంది’’ అని చెప్పారు. తాను కాంగ్రెస్​ను వీడుతానని ఎవరో కలలు కంటే తాను సమాధానం చెప్పలేనన్నారు. నోరు పోయేలా ధర్నాలో అరుస్తున్నప్పటికీ పార్టీ వీడుతానంటూ తనపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తనైన తనకు ఇలాంటి ప్రశ్న వేయడం తప్పని, రాజగోపాల్ రెడ్డిని అడిగే ప్రశ్న తనను అడుగుతున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి, నేషనల్ హైవేలపై ఫోకస్ పెట్టినట్లు ఆయన చెప్పారు.