పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు

పార్టీలోని  ఐపీఎస్ లాంటి పెద్దలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారానికి పిలిస్తే వెళ్లానని, కానీ, ఇప్పుడు మునుగోడులో ప్రచారం చేసేందుకు ఆహ్వానం అందలేదని, పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీలో ఐపీఎస్ లాంటి పెద్దలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారంటూ సెటైర్ వేశారు. తాము హోమ్ గార్డ్, కానిస్టేబుళ్లం అంటూ కామెంట్స్ చేశారు.

ఈ మధ్య మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో ఏర్పాటు చేసిన సభలో తనను సొంత పార్టీ నాయకులతోనే ఇష్టం వచ్చినట్లు తిట్టించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము క్షోభించేలా వ్యక్తిగతంగా దూషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నానని, గతంలో మంత్రి పదవిని త్యాగం చేశానని, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశానని, అలాంటి తనను ఎలా తిట్టిస్తారంటూ ప్రశ్నించారు. చండూరులో సభ ఏర్పాటు చేయించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అద్దంకి దయాకర్ తో క్షమాపణలు ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. తనను తిడుతుంటే వద్దని సీనియర్ నాయకులు కూడా ఎందుకు వారించలేదన్నారు. పార్టీలో ఉంటూ సొంత పార్టీ నాయకులపైనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నడుస్తుందా అని అన్నారు. 

రేవంత్ తో పాటు ఇతర నాయకులు తమను తిట్టిన విషయాన్ని, తన పార్లమెంటు నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఇతర నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకున్న విషయాన్ని కూడా సోనియా, రాహుల్ గాంధీ వద్దే తేల్చుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని చూసిన నాయకులను తనకు తెలియకుండానే పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యే చెరుకు సుధాకర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చెరుకు సుధాకర్ రాకను మొదటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 

ఎవరెన్ని తిట్టినా తనకేం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గతంలో నాలుగు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్లే మళ్లీ పార్టీ మారుతారు కావొచ్చు గానీ, తాను మాత్రం కాంగ్రెస్ ను వీడనని చెప్పారు. రేవంత్ రెడ్డిలా తాను కూడా కొడంగల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో ఉండే నాయకులను కాంగ్రెస్ చేర్చుకోలేనా..? అని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నప్పుడు గౌరవించడం నేర్చుకోవాలంటూ రేవంత్ రెడ్డికి చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలోకి వచ్చిన వాళ్లు మధ్యలోనే పార్టీని విడిచి వెళ్లిపోతారంటూ సెటైర్లు వేశారు. దాసోజు శ్రావణ్ లాంటి మంచి నాయకులు కాంగ్రెస్ ను విడిచి వెళ్లిపోవడం పార్టీకి అంత మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.  

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. తాజాగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. 

ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ
మరోవైపు ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19వ తేదీన సభ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.