తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ప్రధానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్

తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి లేఖ రాశారు. తక్షణ సహాయం కింద రూ. 2000 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ వర్ష భీభత్సాన్ని ప్రధానికి తెలియజేస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి ట్వీట్ చేస్తూ.. ప్రత్యేకంగా లేఖను కూడా పంపారు.

‘కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండా మునిగిపోయింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. చేతి కొచ్చిన పంట నీట మునిగింది. ఈ విషయంలో తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి.. తెలంగాణలో వర్ష భీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలి. తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 2000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనానికే కాకుండా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వానలు, వరదల వల్ల అన్నదాత నిలువునా మునిగిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన వరి, పత్తి సహా దాదాపు అన్ని పంటలు నీటిలో మునిగిపోయాయాని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఇది కచ్చితంగా జాతీయ విపత్తు కింద ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కోమటిరెడ్డి ప్రధానికి ట్వీట్ చేశారు.

For More News..

కేటీఆర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ రోడ్లు చూసి సమాధానం చెప్పు

వరద నీటిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం

మూసీ ప్రాజెక్టుకు గండి కొట్టిన అధికారులు

హైదరాబాద్ అలర్ట్.. ఇవ్వాళ, రేపు సెలవు