బీజేపీ ఆఫీస్​లో సంబురాలు .. బీసీ సీఎం ప్రకటనతో పార్టీ క్యాడర్​లో జోష్

బీజేపీ ఆఫీస్​లో సంబురాలు .. బీసీ సీఎం ప్రకటనతో పార్టీ క్యాడర్​లో జోష్
  • ఇది చరిత్రాత్మక నిర్ణయం: ఎంపీ కె. లక్ష్మణ్ 
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​లను నమ్మొద్దు.. 
  • బీజేపీకే ఓటేయాలని పిలుపు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని పార్టీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ప్రకటన అని కొనియాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలని, ఇంతకాలం ఆ రెండు పార్టీలు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నాయని విమర్శించారు. బీజేపీ బీసీ సీఎం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కమలం గుర్తుకు ఓటేసి.. బీసీని సీఎం చేయండి’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 

రాష్ట్రంలో 54% బీసీలుంటే కేబినెట్​లో మాత్రం ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారని.. 5 శాతం కూడా లేని సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కూడా బీసీలకు వ్యతిరేకమన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకే బీజేపీ బీసీ సీఎం ప్రకటన చేసిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మోదీదే అని స్పష్టం చేశారు.  

బీసీలంటే కేసీఆర్​కు చులకన: ఈటల 

బీసీలంటేనే కేసీఆర్​కు చులకన అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్​లో తనపై వివక్ష చూపారని, చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. మాయమాటలు చెప్పి దళితులను, గిరిజన, ఆదివాసీ బిడ్డలను, అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏలుతోందన్నారు. దేశంలో బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. బీజేపీ బీసీలకు 40 టికెట్లు ఇస్తుందన్నారు. బీసీలంతా బీజేపీకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాష్ర్ట ప్రజలను కోరారు. జనాభాలో సగం కంటే ఎక్కువ బీసీలే ఉన్నారని, వారంతా ఏకతాటిపైకి రావాలన్నారు. బీజేపీలో అన్ని కులాల నేతలు కలిసే బీసీ సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. 

బీజేపీ బీసీల పక్షపాతి: బండి సంజయ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని అమిత్ షా చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమిత్‌‌‌‌ షా ప్రకటనపై రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు శనివారం ఒక ప్రకటనలో సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా బీసీలకు పెద్ద పీట వేసిన దాఖలాలు లేవన్నారు. బీసీని సీఎం చేస్తామంటూ హామీ ఇచ్చిన పార్టీలు లేవని, బీసీ సబ్ ప్లాన్‌‌‌‌కు నిధులను కేటాయించిన చరిత్ర కూడా లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయని, బీసీల్లోని సగం కులాలు నేటికీ చట్ట సభల్లో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. బీసీ నాయకుడు సీఎం అయితే రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. 

ఆలోచించి ఓటేయండి..

బీసీని ప్రధాని చేయడం, దళితుడిని, ట్రైబల్ మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనని సంజయ్‌‌‌‌ గుర్తుచేశారు. ‘‘తెలంగాణలో సబ్బండ వర్గాల పక్షాన పోరాడుతున్నదెవరో.. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాల ఉద్యమించి జైలుకు పోయిందెవరో.. రైతుల కోసం రక్తం చిందించెదెవరో.. పోడు భూములకు పట్టాల కోసం లాఠీ దెబ్బలు తిన్నదెవరో.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పోరుబాటు పట్టిందెవరో.. గడీలకే పరిమితమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ధర్నా చౌక్‌‌‌‌కు గుంజుకొచ్చిందెవరో..’’ఈ వాస్తవాల గురించి తెలుసుకొని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను సంజయ్ కోరారు.