మేడిగడ్డ 3 పిల్లర్లు కూలినట్టే.. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది: ఎంపీ లక్ష్మణ్

మేడిగడ్డ 3 పిల్లర్లు కూలినట్టే.. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పకూలింది.. నిన్న బీఆర్ఎస్ పార్టీ కూలిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కూలినట్టే.. బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలైందని అన్నారు. కవితను బీజేపీలో చేర్చుకోమని.. మా పార్టీలో అవినీతిపరులకు చోటు లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణను తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 

22 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాలాయాపన చేశారని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. ఆ ఎవిడెన్స్ సీబీఐకి ఇచ్చి దర్యాప్తుకు సహకరించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‎లో అవినీతి జరిగిందని కవితే చెప్పారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు అని స్వయంగా కవిత చెప్పారని అన్నారు. తెలంగాణ ఆస్తులను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‎ను బలిపశువును చేశారని కవిత అంటున్నారు.. కానీ హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతిలో కేసీఆర్ పాత్ర ఉందని అన్నారు.

►ALSO READ | నువ్వు ఉంటేంతా.. పోతే ఎంతా.. కేటీఆర్, హరీష్ రావే మాకు ముఖ్యం: సత్యవతి రాథోడ్

గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు మంగళవారం (సెప్టెంబర్ 2) ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, పార్టీ కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.