నువ్వు ఉంటేంతా.. పోతే ఎంతా.. కేటీఆర్, హరీష్ రావే మాకు ముఖ్యం: సత్యవతి రాథోడ్

నువ్వు ఉంటేంతా.. పోతే ఎంతా.. కేటీఆర్, హరీష్ రావే మాకు ముఖ్యం: సత్యవతి రాథోడ్

హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ముందే హెచ్చరించినా ఎమ్మెల్సీ కవిత తన తీరు మార్చుకోలేదని.. అందుకే ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కవిత సస్పెన్షన్ వ్యవహారంపై మంగళవారం (సెప్టెంబర్ 2) బీఆర్ఎస్ మహిళ నేతలు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సందేశాన్ని కేసీఆర్ స్పష్టంగా ఇచ్చారన్నారు.

 పార్టీకి వ్యతిరేకంగా కవిత మాట్లాడిన మాటలు లక్షలాది మంది కార్యకర్తలను బాధపెట్టాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి నాటి నుంచి కేసీఆర్‎కు హరీష్ రావు కుడిభుజంగా ఉన్నారని.. అలాంటి హరీష్ రావుపై కవిత ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కవిత కొన్నాళ్లు కేటీఆర్‎పై.. ఇప్పుడు హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

►ALSO READ | బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలు: మంత్రి వివేక్

కవిత వెనక ఎవరో ఉండి అలా మాట్లాడిపిస్తున్నట్లు మాకు అనిపిస్తుందన్నారు. కవితకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. ఆమె తీర్చు మార్చుకుంటే బాగుండేదన్నారు. కొంతకాలంగా కవిత మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్‎కు నష్టం జరిగిందని.. ఆమె కామెంట్స్‎తో పార్టీ కార్యకర్తలు బాధపడ్డారన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసమే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మీరు అంటే.. మీరు ఉంటే ఎంత పోతే ఎంత అని పార్టీ అంటుందని కవితకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.