- ప్రారంభించిన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: గిరిజన విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలా బాద్ ఎంపీ గొడం నగేశ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కుమ్రం భీం క్రీడా ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తోందని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యం లభిస్తాయని, స్నేహభావం పెంపొందుతుందని, నాయకత్వ లక్షణాలు అలవాడతాయన్నారు. పీవో యువరాజ్ మాట్లా డుతూ.. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. క్రీడా పోటీలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు అని, క్రీడా నైపుణ్యంతో పాటు చదువులో ఎంతోమంది గిరిజన విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. జోనల్ స్థాయిలో విద్యార్థులు రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలనారు.
