- రాజ్యసభలో ఎంపీ నిరంజన్ రెడ్డి
నిర్మల్, వెలుగు: ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ ను వెంటనే నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కోరారు. సోమవారం రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల పొడవుతో రైల్వే లైన్ఏర్పాటుకు 2010-–2011లోనే సర్వే పనులు కూడా పూర్తయ్యాయని గుర్తుచేశారు.
ఆర్మూర్–ఆదిలాబాద్ మధ్య రైల్వే లైన్ సౌకర్యం లేకపోవడంతో ఆదిలాబాద్ ప్రజలు రైలులో హైదరాబాద్ వెళ్లాలంటే నాగపూర్ మీదుగా 400 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే ప్రజలకు దూరాభారం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

