ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడి నిధులు తెచ్చా : ఎంపీ రఘునందన్ రావు

ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడి నిధులు తెచ్చా :  ఎంపీ రఘునందన్ రావు
  •     ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దుబ్బాక అభివృద్ధికి దూరమైందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను  దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడి నిధులు తెచ్చానని, ప్రస్తుత  ఎమ్మెల్యే రేండేళ్ల కాలంలో ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తాను దుబ్బాక అభివృద్ధి కోసం పనిచేస్తుంటే అప్పడు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అడుగడుగునా అడ్డుపడ్డారని ఆరోపించారు. దుబ్బాకపై ప్రేమతోనే భూంపల్లి అక్బర్ పేట కొత్త మండలం ఏర్పాటుకు కృషి చేస్తే అప్పడు ఎంపీగా ఉన్న వ్యక్తి క్లబ్బులు పబ్బులు కావాలని అడిగారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే ఫలితం ఉండదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన  ఐటీఐ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వంద పడకల ఆస్పత్రిని ఎంతో కష్టపడి ప్రారంభించిన విషయం ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపిస్తే వచ్చే ఐదేండ్ల లో పట్టణ రూపు రేఖలను మార్చివేస్తానని హామీ ఇచ్చారు. ఐదేండ్లు కౌన్సిలర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రజలు గమనించాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్​పై ఆధారాలున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు. బావ-బామ్మర్దుల నోరు మూయించకపోతే కాంగ్రెస్​కే రాజకీయ నష్టం తప్పదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు అంబటి బాలేశ్ పాల్గొన్నారు.