
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ యాజమాన్యం 400 మంది కార్మికులతో నాలుగున్నరేళ్లు పనిచేయించుకొని ఉన్నపలంగా విధుల నుంచి తొలగించడం సరికాదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలీస్ పహారా మధ్య కార్మికులపై దౌర్జన్యం చేయడం మంచిదికాదన్నారు. కలెక్టర్, కార్మిక శాఖ అధికారులు తక్షణమే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ నెరవేర్చకపోగా ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు. దీనిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించాలని లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.