హైడ్రాను రాజకీయ లబ్ధికి వాడొద్దు : రఘునందన్ రావు

హైడ్రాను రాజకీయ లబ్ధికి వాడొద్దు : రఘునందన్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రకృతి వనరుల పరిరక్షణకు వాడాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్ జీవో భవన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైడ్రాలో మార్పులు తీసుకువస్తున్నట్లు, కట్టిన ఇండ్లను కూల్చమని చెపుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, కొందరు లీడర్ల ఒత్తిడులకు తలోగ్గి సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటే నవ్వుల పాలవుతారన్నారు. ఇప్పటివరకు కూల్చిన ఇండ్లకు పరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుందన్నారు. 

అక్రమంగా కట్టిన ప్రతి కట్టడాన్ని కూల్చి వేయాలన్నారు. హైదరాబాద్ పాత సీపీ శ్రీనివాస్ ఎంఐఎం నేతల కంట్లో నలుసులా తయారయ్యాడనే మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టంచేశారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి న్యాయవాదులు ముందుకు రావడం దేశ రాజకీయాలకు సంకేతం అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం పొంది ప్రధాని మోదీని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ ప్రముఖ్ సుభాష్ చందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నేతలు బాలేశ్​గౌడ్, గోనే మార్కండేయులు, సుభాష్ చందర్, బైరి శంకర్, గురువారెడ్డి, ఉపేందర్ రావు, నరేశ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.