నిజాం ఆనవాళ్లను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారు

నిజాం ఆనవాళ్లను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారు

దేశంలో మోడీ హిందుత్వ ఎజెండాతో …రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోనికి వచ్చారన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ నిజాం కాలంనాటి పాత కట్టడాలు కూల్చేస్తున్నారని.. దేవాలయాల కూల్చివేతపై మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆలయాల కూల్చివేతలో బీజేపీ , ఎంఐఎం ఇద్దరు దోషులే అన్నారు. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చారని తెలిపారు. నిజాం సర్కార్ కట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నగరంలో ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిజాం ఆనవాళ్లను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని.. ఇందులో భాగంగానే ఉస్మానియా, యాదాద్రి దేవాలయంల‌ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. నూతన సచివాలయ నిర్మాణం కూడా దానిలో భాగమేన‌ని… కూలీకుతుబ్ షాహి కాలంలో నిర్మించిన మసీదు , పోచమ్మ దేవాలయం ఆన‌వాళ్లు లేకుండా పోయాయన్నారు‌.

తెలంగాణలో ఉన్న పురాతన దైవ క్షేత్రాలకు తన మార్క్ చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం మొత్తం నల్ల పోచమ్మ దేవాలయంలో పూజలతోనే మొద‌లు పెట్టార‌న్నారు. సచివాలయంలో దేవాలయం, మసీదు కూల్చివేతపై ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు అయ్యేలా ఉత్తమ్, భట్టి బాధ్యత తీసుకోవాలన్నారు. ఏపీకి రాజధాని లేనట్లు .. తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందన్నారు. ఎంఐఏం పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నలతోనే నడుస్తోందని, ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ను కాదని ఏంఐఎంకు ఇచ్చారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేయాలని .. మీటింగ్ లకే పరిమితం అయితే లాభం లేదని తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇదే విష‌యంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ..సచివాలయంలో మందిరం, రెండు మసీదులను కూల్చివేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమ‌న్నారు. ఈ విషయంలో గతంలోనే నేను అన్ని ఆధారాలతో ముఖ్యమంత్రికి లేఖలు రాశాన‌ని..
ముఖ్యమంత్రి ప్రార్థన మందిరాలను కావాలనే కూల్చి వేసి, ఇప్పుడు అబద్దాలు ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పై న్యాయ పోరాటం చేస్తుందన్నారు ష‌బ్బీర్ అలీ.